ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు నాయకులు. పలు జిల్లాల్లో పార్టీ ఖాళీ అవుతోంది. బడా నాయకులు సైతం గుడ్‌బై చెబుతున్నారు. మాజీ మంత్రులు-ఎంపీలు- ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా బయటికెళ్తోన్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి రోజుల్లోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజీనామాల పర్వం కొనసాగుతూనే వస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు.
ఈ మధ్యే- మాజీ అవంతి శ్రీనివాస్, భీమవరానికి చెందిన మాజీ శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్ కూడా అదే బాట పట్టారు. వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది. అడారి ఆనంద్ కుమార్, రాయలసీమకు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.








