మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం
15 మంది ప్రయాణికులు మృతి!
40 మందికి పైగా గాయాలు
మహా: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ప్రయాణికులపై ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందారు. ఇందుకు సంబంధించి ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్ గావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలోని పాచోరా ప్రాంతంలో పుష్పక్ ట్రైన్ వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో లోకో పైలట్ బ్రేకులు వేశారు. బ్రేకులు వేయడంతో రైలు చక్రాల నుంచి పొగ వచ్చింది. దీంతో ఆ పొగను చూసిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రైన్ లో మంటలు వ్యాపించాయంటూ గట్టిగా అరుస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు. వారిలో చాలామంది రైలులోంచి దూకేశారు. అందులో ఉన్న మిగతా ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. ఇలా పట్టాలు దాటుతుండగా ఎదురుగా వస్తున్న కర్నాటక ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం. 40 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.








