సాధారణ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపినందుకు నిరసనగా డాక్టర్ బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సాధారణ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగా ఆదివారం ట్యాంక్ బండపై ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో భారీ నిరసన చేపట్టారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక బీఆర్ అంబేద్కర్ విగ్రహల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కేడర్‌కు ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ది, రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా అందరు కలిసి రావాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇచ్చే వరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డికి రాష్ట్రాభివృద్ధి పట్టదా? అంటూ వారిని పీసీసీ చీఫ్ నిలదీశారు. తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్, మంత్రులు ఒంటరి పోరాటం చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నంప్రభాకర్ , గ్రేటర్ హైదరాబాద్ నేతలు పాల్గొన్నారు.
…….








