గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది. దీంతో ఫలితాల విడుదలకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్ -1 పోస్ట్ల భర్తీ ద్వారా రేవంత్ సర్కార్ చరిత్ర క్రియేట్ చేయనుంది. గతంలో గ్రూప్-1 నియామకాలకు సంబంధించి పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో టీజీపీఎస్సీ త్వరలో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు ఇవే కావడం విశేషం.








