మహా : ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం , దేశ రాజధానికి ఫట్టిన పీడ విరగడైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఫలితాలపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి 27 ఏళ్ళుగా ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్, ఆప్ ప్రభుత్వాలకు పట్టం కట్టారని, 27 ఏళ్ళ తర్వాత బీజేపీని తిరిగి గెలిపించారన్నారు. ఢిల్లీలో నీతి వంతమైన అభివృద్ధి పాలనను అందించనున్నామని పేర్కొన్నారు. ఢిల్లీని సుదీర్ఘ కాలం పాలించిన కేజ్రీవాల్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలవడం వల్లే ప్రజలు ఆయనను ఛీ కొట్టారని వ్యాఖ్యానించారు. అహంకారం నెత్తికెక్కితే ప్రజలు ఎలా బుద్ది చెబుతారో ఈ ఎన్నికలు మరోసారి రుజువయ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సేవ కోసం రాజకీయాలలోకి వచ్చిన వారికి అహంకారం అనేది పనికి రాదని, అధికారం ఉంది కదా అని విర్రవీగడం, అహంకారంతో ఎవరిని పడితే వారిని ఇషఅటానుసారంగా మాట్లాడటం సరైంది కాదన్న విషయాన్ని ప్రజలు మరోసారి చెప్పకనే చెప్పారన్నారు. ఎవరిని గద్దె నెక్కించాలి, ఎవరిని ఇంటికి పంపాలని ప్రజలు ఒక సారి నిర్ణయించుకుంటే ఎంత పెద్ద నేతనైనా భరించాల్సిందేనని అన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించిందని కిషన్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. వరుసగా మూడు సార్లు, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జీరో స్థానాలను ఇచ్చి ఢిల్లీ ప్రజలు ఆ పార్టీ పట్ల తమకున్న వ్యతిరేకతను తెలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తాను గెలవాలని కోరుకోదని, ఎప్పుడూ మోడీని ఎలా ఓడించాలని దివాళాకోరు ఆలోచనే అని మండిపడ్డారు. ప్రజల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించిన పాపాన పోదన్నారు. రాజ్యాంగం బుక్ ను చేత పట్టుకుంటే ప్రజలు ఓట్లెయ్యరన్న విషయాన్ని ఆ పార్టీ నేత గ్రహిస్తే బాగుంటుందన్నారు. రాజ్యాంగ బుక్ ను పట్టుకోవడం కాదు రాజ్యాంగం విలువలను కాపాడాలన్న విషయాన్ని ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు గుర్తించాలని హితవు పలికారు. లిక్కర్ పేరుతో భారీ కుంభకోణం జరిగిందని, సామాన్య ప్రజల శ్రమను దోచుకునేందుకు ఆప్ చేసిన కుట్రకు ప్రజలు సరైన బుద్ది చెప్పారన్నారు. లిక్కర్ స్కాంలో భారీ దోపిడీ జరిగిందని, ఈ కేసులో కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉందన్నారు. ఈ కేసులో కోర్టు తీర్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఉత్తుత్తి హామీలు, ఉచితాలు అఇవసరం లేదని, ఇచ్చిన హామీలు కొన్నైనా సరే వాటిని ఖచ్చితంగా అమలు చేసే పార్టీ కావాలని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారన్నారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు.








