విద్యార్థులు తమకు ఏ సమస్య వచ్చినా లోలోపల దాచుకుని బాధపడొద్దని.. బయటకు చెప్పాలని బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సూచించారు. స్కూల్లో చదువుకునేటప్పుడు తానూ అల్లరి పిల్లనే అని దీపికా పదుకొణె. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ ’ను ఈసారి కాస్త వినూత్నంగా నిర్వహించారు. ఇందులోభాగంగా నటి దీపిక పాల్గొని.. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు సలహాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘‘చిన్నప్పుడు స్కూల్లో నేనూ సోఫాలు, టేబుల్స్, కుర్చీలు ఎక్కి అల్లరి చేసేదాన్ని. చదువుకునే రోజుల్లో చాలా ఒత్తిడి ఉంటుంది. ఉదాహరణకు నాకు లెక్కలంటే చాలా భయం. ఇప్పటికీ అందులో నేను వీక్‌గానే ఉంటా. అయితే, ఆ భయాన్ని అధిగమించాలి. ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకంలో వివరించినట్లుగా.. సమస్యను లోలోపల అణచిపెట్టుకోకుండా.. బయటకు చెప్పాలి. మీ తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబసభ్యులు, టీచర్లతో పంచుకోవాలి. జర్నల్ లేదా డైరీ రాయడం అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు వ్యక్తపర్చుకోవడం కోసం అది గొప్ప మార్గం’’ అని దీపిక వివరించారు. తాను కూడా ఒక దశలో కుంగుబాటు సమస్యను ఎదుర్కొన్నట్లు నటి ఈసందర్భంగా తెలిపారు. దీపిక ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ట్రైలర్ మాత్రమే పంచుకున్నారు. పూర్తి వీడియోను ఫిబ్రవరి 12న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఈసందర్భంగా ప్రధాని మోదీకి దీపిక కృతజ్ఞతలు తెలియజేశారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.








