Mahaa Daily Exclusive

  న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేశాం – సీఎం రేవంత్‌రెడ్డి

Share

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎమ్మార్పీఎస్‌ నేతలతో కలిసి సీఎంతో ఆయన సమావేశమయ్యారు. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికలోని లోపాలను సీఎం రేవంత్‌ దృష్టికి మందకృష్ణ తీసుకెళ్లారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లపై సీఎంతో చర్చించారు. సీఎంతో జరిగిన ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అసెంబ్లీలో చర్చించామని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మేలు చేస్తామని, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేసే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. కేబినెట్ సబ్‌కమిటీ, న్యాయకమిషన్ వేసి అధ్యయనం చేయించామని, వేగంగా నివేదిక తీసుకుని, కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టామని తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశామని అన్నారు.

ఎస్సీలను మూడు కాదు నాలుగు గ్రూపులు చేయాలి

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారు. ఇందులో రేవంత్‌రెడ్డి భాగస్వామ్యం అయ్యారు. అందుకే వారికి ధన్యవాదాలు తెలిపాం. అయితే, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికలో కొన్ని లోపాలున్నాయి. ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలి. నివేదికలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తారని ఆశిస్తున్నాం’’అని మందకృష్ణ అన్నారు.

Latest