కేరళలో కొత్త ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ భారత దేశంలోని కేరళ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 11శాతం ,దాదాపు 4,22,299 హెక్టార్ల భూమి ప్రస్తుతం ఎడారీకరణ దశలో క్షీణించిపోతుంది. ఈ క్షీణత జీవవైవిధ్య నష్టం, ఆహార అభద్రత, నీటి కొరత, మానవ-వన్యప్రాణుల సంఘర్షణలకు దారితీస్తుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ అంశమే ఇప్పుడు దేశంలో పర్యావరణ పరిరక్షణ విషయంపై సరికొత్త ఆందోళనలను లేవనెత్తుతోంది. ఒక్క కేరళ మాత్రమే కాదు.. దేశ మొత్తం భౌగోళిక ప్రాంతంలో దాదాపు 30శాతం భూమి ఎడారీకరణకు లేదంటే క్షీణతకు గురవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఇటీవల రాజ్యసభలోఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భారత్ కు చెందిన రాష్ట్రాలు, యూటీలలో, ఎడారీకరణ, భూమి క్షీణత పై నిర్వహించిన సర్వేపై.. వివరాలు తెలిపిన మంత్రి… దేశంలోనే అత్యధికంగా జార్ఖండ్ – 68.7, రాజస్థాన్ – 62.06, దిల్లీ – 61.73, గోవా – 52.6 శాతం ఎడారీకరణను ఎదుర్కొంటుంటే.. వాటి తర్వాత గుజరాత్ – 52.22 ఎడారీకరణను ఎదుర్కొంటున్నట్లుగా వెల్లడించారు. అడవులను తోటలుగా మార్చడం వంటి అశాస్త్రీయ భూ వినియోగ మార్పులు సమస్యను తీవ్రతరం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే.. వివిధ అంశాలను పరిశీలిస్తున్న కేరళ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు నిపుణులు.. కేరళలో ఈ తోటలుగా మారుతున్న అడవుల శాతం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. కొండచరియలు విరిగిపడటం వంటి సహజ ప్రమాదాలు కూడా ఈ సమస్యకు పెంచుతున్నాయని అంటున్నారు.








