పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్‌లోని మధుబనిలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులను, వారికి అండగా నిలిచేవారిని ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని కఠిన స్వరంతో హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరికను జారీ చేసే క్రమంలో ప్రధాని మోదీ అనుసరించిన వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉద్వేగంగా హిందీలో ప్రసంగిస్తున్న ఆయన, కీలకమైన హెచ్చరిక సమయంలో ఒక్కసారిగా ఇంగ్లీషులో మాట్లాడారు. హిందీలో ప్రసంగాన్ని కొనసాగిస్తూ, పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని, బాధ్యులైన వారిని శిక్షిస్తామని చెబుతున్న ప్రధాని మోదీ, అకస్మాత్తుగా తన ప్రసంగ భాషను మార్చారు. “ఈ రోజు, బీహార్ గడ్డ పైనుంచి యావత్ ప్రపంచానికి నేను చెబుతున్నాను” అంటూ ఆయన ఇంగ్లీషులో మాట్లాడటం ప్రారంభించారు. ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచే వారిని భారత్ గుర్తిస్తుంది, వారి జాడ కనిపెడుతుంది మరియు శిక్షిస్తుంది. వారిని భూమి చివర వరకైనా వెంటాడుతాం అని మోదీ స్పష్టమైన ఆంగ్లంలో, తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. సాధారణంగా దేశ ప్రజలను ఉద్దేశించి హిందీలో ఎక్కువగా ప్రసంగించే ప్రధాని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై హెచ్చరిక చేసే సమయంలో ఇంగ్లీషు భాషను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందేశం కేవలం దేశ ప్రజలకే కాకుండా, యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా ఉగ్రవాదానికి మద్దతిస్తున్న శక్తులకు సూటిగా, ఎలాంటి అస్పష్టత లేకుండా చేరాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని భాష మార్చి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఉగ్రవాదంపై పోరులో భారతదేశం యొక్క దృఢ సంకల్పాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి బలంగా వినిపించే ప్రయత్నంగా కనిపిస్తోందని వారు తెలిపారు. ఆ తర్వాత తిరిగి హిందీలోకి మారిన మోదీ, “ఉగ్రవాదం వల్ల భారతదేశ స్ఫూర్తి ఎప్పటికీ దెబ్బతినదు… ఉగ్రవాదం శిక్షార్హమైనది. న్యాయం జరిగేలా చూసేందుకు ప్రతి ప్రయత్నం జరుగుతుంది. యావత్ దేశం ఈ సంకల్పంతో దృఢంగా ఉంది” అని ఉద్ఘాటించారు.








