Mahaa Daily Exclusive

  పహల్గాం ఉగ్రదాడి అఖిలపక్ష భేటీకి కేంద్రం నిర్ణయం..!

Share

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన విషయం విదితమే. అయితే, ఈ సమావేశానికి ఎంపిక చేసిన కొన్ని పార్టీలనే ఆహ్వానించాలన్న కేంద్రం యోచనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీలనూ ఈ సమావేశానికి పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో నిన్న రాత్రి ఫోన్‌లో మాట్లాడానని ఒవైసీ తెలిపారు. ఐదు నుంచి పది మంది లోక్ సభ సభ్యులున్న పార్టీలనే సమావేశానికి ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి తనతో చెప్పారని పేర్కొన్నారు. తక్కువ మంది ఎంపీలున్న పార్టీలను ఎందుకు పిలవడం లేదని తాను ప్రశ్నించగా, అందరినీ ఆహ్వానిస్తే సమావేశానికి ఎక్కువ సమయం పడుతుందని మంత్రి సమాధానమిచ్చారని ఒవైసీ వివరించారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఒవైసీ తప్పుపట్టారు. “ఇది కేవలం బీజేపీకో లేక కొన్ని ఇతర పార్టీలకో సంబంధించిన అంతర్గత సమావేశం కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఒకటిగా నిలుస్తుందనే బలమైన సందేశాన్ని పంపాల్సిన అవసరం ఉంది. అటువంటప్పుడు కొన్ని పార్టీలనే పిలవడం సరైన పద్ధతి కాదు” అని అన్నారు. అఖిలపక్షం సూచనలు వినడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో గంట సమయం కేటాయించలేరా? ఇది కేవలం రాజకీయ అంశం కాదు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సమస్య. మీ సొంత పార్టీకి కూడా పూర్తి మెజారిటీ లేదు. కాబట్టి, నిజమైన అఖిలపక్ష సమావేశం నిర్వహించి, పార్లమెంటులో సభ్యులున్న ప్రతి పార్టీని ఆహ్వానించాలని ప్రధానమంత్రి మోదీని కోరుతున్నాను” అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.