ఆదిలాబాద్, మహా
అధిక వడ్డీకు అప్పులు ఇవ్వడం, దొడ్డిదారిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం.. వంటి మోసాలకు పాల్పడుతున్న వారి ఆగడాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. ముఖ్యంగా అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ రైతులను మోసగిస్తున్న దళారుల దోపిడికి అడ్డుకట్ట వేస్తున్నారు.
ఇస్తూ రైతులు, జనాలను మోసం చేస్తున్న దళారుల ఆగడాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. దళారులు చేస్తున్న మోసాలను కనిపెట్టి రైతులను దాగా చేస్తున్న పలువురిపై కేసులు నమోదు చేసి కటకటాల పాలు చేస్తున్నారు. తాజాగా గురువారం బ్యాంకుల వద్ద రైతుల నుంచి పంట రుణం చెల్లించేందుకు అధిక రుసుం వసూలు చేసిన 34మంది దళారులపై కేసులు నమోదు చేశారు. రైతుల వేషధారణలో బ్యాంకుల వద్దకు వెళ్లిన పోలీసులు దళారులను పట్టుకున్నారు. ఇలా గత కొన్ని రోజులుగా వివిధ రకాల మోసాలను అరికడుతున్న పోలీసుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమాలపై తొలి నుంచి దృష్టి
జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ తొలి నుంచి జిల్లాలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమ ఇసుక వ్యాపారం మొదలుకొని వీడీసీల ఆగడాలకు చెక్ పెట్టారు. పెన్ గంగా నది నుంచి ఇసుక తీసుకెళ్తన్న వారి రుసుము వసూలు చేసిన వీడీసీలపై కేసులు నమోదు చేయించారు. వీటితో పాటు జనాలను అవసరాలే పెట్టుబడిగా వ్యవహరిస్తూ అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ ఆస్తులు కుదువ పెట్టుకుంటున్న పలువురు దళారులపై కేసులు నమోదు చేశారు. అధిక వడ్డీల ఊబి నుంచి బాధితులకు విముక్తి కలిగించారు. మద్యం బెల్ట్ దుకాణాలు, బెట్టింగ్, జూదం, గంజాయి విక్రయంతో పాటు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వారిని పట్టుకోవడం, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న తెల్లకల్లు బట్టీలను మూసి వేయించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటితో పాటు ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ర్టేషన్ చేయించుకోవడం ఇలా జిల్లాలో జరుగుతున్న అనేక దందాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పోలీసుల పనితీరుపైనే చర్చించుకోవడం కనిపిస్తోంది.
దళారుల దోపిడికి చెక్
రైతులు, అమాయక ప్రజల అవసరాలే లక్ష్యంగా కొందరు మద్య దళారులు దందాలు చేస్తున్నారు. రైతులు ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ రాగానే గతేడాది తీసుకున్న పంట రుణం బ్యాంకులకు చెల్లించి కొత్తగా మళ్లీ రుణం తీసుకుంటారు. కానీ ఇది వరకు తీసుకున్న రుణం చెల్లిస్తేనే బ్యాంకులు కొత్తగా పంట రుణాలు ఇస్తుంటాయి. ఇదే అదనుగా అనేక మంది దళారులు రైతుల దగ్గరికి వెళ్లి వారి పంట రుణం చెల్లిస్తామని ..మళ్లీ కొత్త రుణం తీసుకున్న తర్వతా రూ.5వేల నుంచి రూ.10వేల వరకు తమకు అందజేయాలని షరతు విధిస్తుంటారు. గత్యంతరం లేని పరిస్థితిలో అనేక మంది రైతులు ఇలాంటి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని పంట రుణాలు చెల్లిస్తుంటారు. ఇలా అప్పటికప్పుడు రుణం చెల్లించేందుకు వడ్డీరూపంలో రూ.వేలు వసూలు చేస్తుండటంతో రైతులకు నష్టం జరగడంతో పాటు వడ్డీ వ్యాపారులు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లాలో ఇలాంటి దందా అనేక ఏండ్ల నుంచి సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనేక మంది రైతులు మోసపోతున్నారు. తాజాగా జిల్లా పోలీసులు వివిధ ప్రాంతాల్లోని తొమ్మిది బ్యాంకుల వద్దకు రైతుల వేషధారణలో వెళ్లి దళారులను సంప్రదించగా.. అధిక వడ్డీలు తీసుకుంటున్నట్లు గుర్తించడమే కాకుండా రెడ్ హ్యండెడ్ గా పట్టుకోవడం సంచలనంగా మారింది. ఇలా దళారుల మోసాల బారి నుంచి కాపాడి అనేక మంది రైతులకు ఉపశమనం కలిగించారు. గత కొంత కాలంగా జిల్లాలో పోలీసులు కనబరుస్తున్న పనితీరు పట్ల ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








