రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం కొత్తూర్ మండలం మల్లాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా? అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్‌డెస్క్ లను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదేపదే తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు సూచించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు. అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పని చేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్బంగా గ్రామంలోని కొందరు రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని వారికి తెలిపారు. అందులో ముగ్గురు రైతులు మేం ముగ్గురం అన్నదమ్ములం తమకు ఉన్న భూమి ఒక్కరి పేరుమీదకు మారిందని ఒక్కరికే రైతు భరోసా వస్తుందని, భూమి ముగ్గురి పేర్ల మీదకు మార్చాలని, అట్టి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు తెలిపారు. అందుకు కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఒకరి భూమికి ఉన్న హద్దులు, గట్టు, బాట లేకుండా ఆక్రమించుకొని సాగు చేయడం జరుగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు కలెక్టర్ స్పందిస్తూ అట్టి భూమిని సర్వేయర్ తో సర్వే చేయించి హద్దులు, గట్టు ఏర్పాటు చేయించాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ సదస్సులో కలెక్టర్ వెంట షాద్ నగర్ ఆర్డీఓ సరిత, తహశీల్దార్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ జంగయ్య, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Post Views: 62








