మహా: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది శంకుస్థాపనగా కర్ర పూజ ఘనంగా నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమంతో ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమాన్ని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు 69 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. ఈసారి గణపతి రూపాన్ని శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా రూపొందిస్తున్నారు. మహాగణపతికి కుడి వైపు శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దర్శనమిస్తే, ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి కూడా కొలువై ఉంటారు. ఉత్సవ సమితి సభ్యులు ఈ ఏడాది గణపతి రూపాన్ని అధికారికంగా విడుదల చేశారు. భక్తులకు విశేషంగా ఆకర్షించే విధంగా రూపొందిస్తున్న ఈ గణేశ్ విగ్రహం నిర్మాణం త్వరలో ప్రారంభమవనుంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ఉత్సవ కమిటీలు సిద్ధంగా ఉన్నాయి.
ఈ సారి 71 వేడుకలు..
ఇరువైపులా కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉండనున్నారు. కర్ర పూజ కార్యక్రమంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల్ రామచంద్రారెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. 70 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సారి 71 వేడుకలు నిర్వహిస్తున్నామని.. ఈ సందర్భంగా జరుగుతున్న వేడుకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో ఖైరతాబాద్ గణనాధుడు పేరు ప్రతిష్టలు వచ్చాయని తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం, పోలీస్ శాఖ అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసిందని, మీడియా పాత్ర ఎప్పటికి మరచిపోలేమన్నారు. ప్రతి ఒక్కరు ఈ సారి జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సపోర్ట్‌గా ఉంటారని ఆశిస్తున్నానన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ త్వరగా కోలుకుని ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు.








