రంగారెడ్డి జిల్లా మహా:
విద్యార్థి దశ నుండి ఉద్యమాల బాటలో నడిచిన నాగటి భాస్కర్ ప్రజా సేవలోనే గాక, తదుపరి ఉద్యోగ సంఘాల నేతగా అందించిన సేవలు మరువలేనివని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, ఆకస్మికంగా మృతి చెందిన తులేకలాన్ గ్రామానికి చెందిన భాస్కర్ ప్రథమ వర్ధంతి ఆదివారం ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. భాస్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ… విద్యార్థి ఉద్యమాలలో, ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న భాస్కర్ అనంతరం ప్రభుత్వ ఉద్యోగిగా కూడా నిబద్ధతతో పనిచేసాడని చెప్పారు. చిన్న వయస్సులోనే అందరివాడుగా పేరొందిన భాస్కర్ అకాలమరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాస్కర్ సతీమణి, తులేకలాన్ మాజీ ఎంపిటిసి నాగటి నాగమణి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, తాజా మాజీ సర్పంచ్ యాదగిరి, బిఆర్ఎస్ నాయకులు నరసింహ్మ, జనార్దన్ రెడ్డి, రమేశ్, బాష, కళ్యాణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.








