ఖమ్మం, మహా.
రైతు సమస్యలపై మౌలికంగా పరిష్కారాలను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన దిశగా అడుగులు వేస్తోంది. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు వేదికల నిర్మాణ యజ్ఞం.. నేటికీ నిర్వహణ నిధుల లభ్యత లేక రైతు విస్తరణాధికారులకు భారంగా మారిన పరిస్థితిని పరిగణలోకి తీసుకొని, నూతనమైన ఆలోచనతో ముందుకెళ్తోంది ప్రభుత్వం. విద్యుత్ బకాయిలతో కొట్టుమిట్టాడుతున్న వేదికలకు శాశ్వత పరిష్కారంగా… వాటిపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా నిత్యాదాయ మార్గాన్ని ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రధాని కుసుమ్ యోజన కింద రైతు వేదికలు, మార్కెట్ యార్డులు, రైతుబజార్లలో సోలార్ యూనిట్ల ఏర్పాటుకు వ్యూహం రూపొందుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రయత్నం మొదలవ్వడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలు ‘స్వయం సమృద్ధి కేంద్రాలుగా’ రూపాంతరం చెందనున్న వాతావరణం నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ వ్యవసాయ పురోగతికి సంకేతంగా నిర్మితమైన రైతు వేదికలు, ఇప్పుడు సోలార్ ఆధారిత ఆదాయ మార్గంగా పరిణమించనున్నాయి. 2021లో ప్రతి ఐదు వేల ఎకరాల వ్యవసాయ భూమికి ఒక క్లస్టర్‌గా గుర్తించి.. ఒక్కో క్లస్టర్‌కు రైతు వేదిక నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రారంభ నిధులు మంజూరు చేసినప్పటికీ నిర్వహణ నిధులు తక్కువగా ఉండటంతో ఈ వేదికలు గత కొంతకాలంగా ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 250 పైగా రైతు వేదికలను నిర్మించారు.
విద్యుత్ బిల్లులు చెల్లించలేక విద్యుత్ కట్ అవడం, కార్యాలయాలు పాడైపోవడం వంటి సమస్యలు విస్తృతంగా ఎదురవుతున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వేదికలకు స్వయం ఆదాయం పొందే అవకాశాన్ని అందించేందుకు ముందడుగు వేసింది. ప్రత్యేకంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ అవసరాలను తీరుస్తూ.. మిగులు విద్యుత్‌ను విద్యుత్‌శాఖకు విక్రయించి ఏటా రూ.25 వేలు ఆదాయం పొందేలా ప్రణాళిక రూపొందించారు.
ప్రధాన మంత్రి కుసుమ్ యోజన కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు మొదటగా ఖమ్మం జిల్లాలో పైలట్‌గా అమలవుతోంది. అక్కడి ఐదు రైతు వేదికలపై ఇప్పటికే సోలార్ యూనిట్లు అమర్చగా, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రెడ్కోతో కలిసి కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఒక్కో వేదికపై 5 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ అమర్చనున్నారు. దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాదు.. స్వయం ఆదాయ మార్గం ఏర్పడి వేదికల నిర్వహణలో చక్కదిద్దే అవకాశముంటుంది.
రైతు నేస్తం వంటి పథకాల అమలులో రైతు వేదికల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం, విద్యుత్ బకాయిలను తొలగించేందుకు కొంతమేర నిధులు విడుదల చేయనుంది. దీని ద్వారా ఇప్పటివరకు నిష్క్రియంగా ఉన్న వేదికలు మళ్లీ చురుకుగా మారే అవకాశం ఉంది. గ్రామీణ రైతుల చట్టప్రబోధ, శిక్షణా కేంద్రాలుగా రూపొందిన రైతు వేదికలు.. నూతన మార్గదర్శకాలు రూపుదిద్దుకుంటున్న ఈ తరుణంలో.. స్వయం సమృద్ధికే ఈ సోలార్ వ్యూహం ఊతమిచ్చే అవకాశముంది.








