హైదరాబాద్, మహా : కొద్ది రోజల క్రితం బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచందర్‌రావు బీజేపీ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ లతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ, ఒకప్పుడు బీజేపీకి రాష్ట్రంలో సున్నా ఓట్లున్నాయన్న బీఆర్ఎస్ పరిస్థితి సున్నాకు చేరిందన్నారు. బీజేపీకి 2023 ఎన్నికల్లో 13.9 శాతం ఓట్లు వచ్చాయని 2024లో 36 శాతం ఓట్లు వచ్చాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు.. ఆ తర్వాత రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా రాంచందర్ రావు వ్యాఖయ్లు చేశారు. సీఎం ఢిల్లీ రాష్ట్రాన్ని పాలించకుండా హైదరాబాద్ లో ఉండి పాలిస్తే బాగుంటుందని చురక అంటించారు. రాషఅట్రం వర్షాలతో వణికి పోతుందని, హైదరాబాద్ వాసులు నరకయాతన పడుతున్నారని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం ప్రయత్నిస్తే బాగుంటుందన్నారు. రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ నేత అని, రాజకీయాలు చేయడం చేతకాని రాహుల్ ఈసీని విమర్శించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీహార్ ఎన్నికల్లో లబ్ధికోసం రాహుల్ గాంధీ కొత్త డ్రామాను మొదలు పెట్టారని దుయ్యబట్టారు. బీహార్ లోనూ యూపీఏ కూటమికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
గువ్వల బాలరాజు మాట్లాడుతూ, అన్ని పార్టీలను స్టడీ చేసిన తర్వాతే బీజేపీలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో జర్నీ ప్రారంభిస్తానని, ఎలాంటి పదవుల కోసం వెంపర్లాడబోనని అన్నారు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో జనాల్లోకి తీసుకువెళ్లడానికి తాను సిద్ధమన్నారు. బీజేపీలో చేరుతుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని.. అనవసరంగా బీఆర్ఎస్ చేరికపై చర్చించవద్దని కోరుతున్నానని బాలరాజు అన్నారు. బీఆర్ఎస్ తనపై తప్పుడు ప్రచారాన్ని ఆపకపోతే చట్ట ప్రకారం చర్యలుంచటాయని హెచ్చరించారు. తాను అవకాశవాదిని కాదని, అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన వాడిని అని గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. నాడు బీఆర్ఎస్లో చేరమని నన్ను ఎవరు అడగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో దళిత వర్గాలకు చోటులేదని విమర్శించారు.
ఆ రెండు పార్టీలు దోపిడీ చేస్తున్నాయి..
దశాబ్దాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాయని గువ్వల బాలరాజు ఆరోపించారు. దోపిడీని అరికట్టడానికి బీజేపీ పోరాటాలు చేస్తోందన్నారు. దేశ రక్షణ కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. మోదీ దేశానికి ఒక ఆర్కిటెక్చర్‌ను అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒక ఇంపోర్ట్ లీడర్ షిప్ కలిగిన పార్టీ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్లో దళిత వర్గాలకు చోటులేదని విమర్శించారు. రాజకీయంగా తనకు అచ్చంపేట జన్మనిచ్చిందని, కానీ అక్కడి ప్రజలకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు క్షమించాలని కోరారు. రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ నుంచి కూడా పిలుపు వచ్చిందని చెప్పారు.
అందుకే బీజేపీలో చేరాను..
రాష్ట్రంలో పొలిటికల్ మాస్టర్ “కీ” బీజేపీ అని అందుకే బీజేపీలో చేరడం జరిగిందని గువ్వల స్పష్టం చేశారు. నిబద్ధతతో కూడిన కార్యకర్తగా బీఆర్ఎస్లో పనిచేశానని, కానీ బీఆర్ఎస్లో క్రెడిబిలిటీ లేని రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు భిక్ష ఇచ్చిందని, కానీ కేసీఆర్ ఎవరికి భిక్ష ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుస్తారని ఎవరి భిక్ష వల్ల గెలవరని గువ్వల ఉద్ఘాటించారు.
నా ఓటమికి వారే కారణం..
గత ఎన్నికల్లో తన ఓటమి కోసం బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నం చేశారని గువ్వల బాలరాజు మండిపడ్డారు. బీజేపీలో చేరుతానంటే తనపై, తన సతీమణిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారం కావాలనీ చూస్తోంది, కాంగ్రెస్ మళ్ళీ రెన్యువల్ కావాలని చూస్తోందని చెప్పుకొచ్చారు. ఏది కావాలన్న ఎన్నికలు రావాలి.. ఏదైనా ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అచ్చంపేట నుంచే మొదలుపెడతామని గువ్వల ధీమా వ్యక్తం చేశారు.








