Mahaa Daily Exclusive

  కవిత కొత్త పార్టీకి రేవంత్ రెడ్డి స్పాన్సర్: ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

Share

  • కవిత కొత్త పార్టీకి రేవంత్ స్పాన్సర్
  • ఎమ్మెల్యే సంజయ్ ఒక శని లాంటోడు
  • బీజేపీ బలం బీసీల అండ – అర్వింద్

**హైదరాబాద్, మహా**
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిప్పులు చెరిగారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ఆ పార్టీకి తెర వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అసలైన స్పాన్సర్ అని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని, అందుకే ఈ వింత పొత్తులు కనిపిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజురోజుకూ బలపడుతోందని, ముఖ్యంగా బీసీ వర్గాల సంపూర్ణ మద్దతుతో తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు చూస్తుంటే ఆ పార్టీ పతనం ప్రారంభమైందని అర్వింద్ వ్యాఖ్యానించారు.
జగిత్యాల రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై ఎంపీ అర్వింద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంజయ్ ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు తలెత్తుతాయని, ఆయన ఒక ‘శని’ లాంటి వ్యక్తి అని ఘాటుగా విమర్శించారు. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు అదే పార్టీకి చెందిన డాక్టర్ శ్రావణిని బయటకు పంపించారని, ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీ వీడేలా చేశారని దుయ్యబట్టారు. 42 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి వంటి నేత ఈరోజు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే దానికి కారణం సంజయ్ అని ఆయన పేర్కొన్నారు. జీవన్ రెడ్డి తొందరపడుతూ పార్టీ మారుతున్నారని, అయితే రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు కాంగ్రెస్ అంతర్గత వైఫల్యాలకు నిదర్శనమని అన్నారు.
భవిష్యత్తులో ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ ప్రయాణంపై కూడా అర్వింద్ ఆసక్తికర జోస్యం చెప్పారు. సంజయ్ మళ్ళీ తన పాత గూడు బీఆర్ఎస్‌లోకి చేరడం ఖాయమని, ఆయనకు ఎక్కడా స్థిరత్వం ఉండదని ఎద్దేవా చేశారు. పార్టీలు మారుస్తూ నాయకులను ఇబ్బంది పెట్టడమే ఆయన నైజమని విమర్శించారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేని నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మేనేజ్‌మెంట్‌తో కాలం వెళ్లదీస్తోందని, ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.