Mahaa Daily Exclusive

  మాయా మురుగునీటి పారుదల….

Share

* పల్లెల్లో పారిశుధ్య విప్లవం.
*పవన్‌ కళ్యాణ్ ‘మ్యాజిక్ డ్రెయిన్స్‌’పై ఒలింపిక్ విజేత పీవీ సింధు ప్రశంసల జల్లు.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టిన ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ గ్రామీణ పారిశుధ్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టాయి. ఈ వినూత్న విధానంపై అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు ప్రశంసల వర్షం కురిపించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్ర లక్ష్య సాధనలో మ్యాజిక్ డ్రెయిన్స్ ఒక ‘గేమ్ ఛేంజర్’ అని ఆమె కొనియాడారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేపట్టిన 20 నెలల పాలనలో పల్లెల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
సాధారణంగా గ్రామాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ పెద్ద సవాలుగా ఉంటుంది. సరైన కాలువలు లేక, అపరిశుభ్ర వాతావరణం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతుంటారు. ఈ సమస్యను లోతుగా విశ్లేషించిన పవన్ కళ్యాణ్, అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన మ్యాజిక్ డ్రెయిన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ విధానం వల్ల సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే దాదాపు 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా అవుతుండటం విశేషం. ఇది ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడమే కాకుండా, వేగంగా పనులను పూర్తి చేయడానికి దోహదపడుతోంది. కేవలం ఆర్థిక పరమైన ప్రయోజనాలే కాకుండా, పర్యావరణ హితంగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దడం విశేషం.
ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటిని ఈ మ్యాజిక్ డ్రెయిన్లు క్షణాల్లో భూమిలోకి పంపుతాయి. ఇందులో అమర్చిన మూడంచెల వడపోత విధానం (ఫిల్టర్ బెడ్) ద్వారా నీరు శుద్ధి చేయబడి భూగర్భంలోకి చేరుతుంది. దీనివల్ల మురుగునీరు నిల్వ ఉండటం, దుర్వాసన రావడం వంటి సమస్యలు తలెత్తవు. మురుగు నీరు నిల్వ ఉండకపోవడం వల్ల దోమలు, ఈగల వ్యాప్తి తగ్గి, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పల్లెల్లో పారిశుధ్యాన్ని పెంపొందించడంలో ఈ వినూత్న ఆలోచన అద్భుత ఫలితాలను ఇస్తోందని పీవీ సింధు తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
పరిపాలనా రంగంలోకి కొత్తగా వచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై లోతైన అవగాహనతో ముందుకు సాగుతున్నారని సింధు కొనియాడారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఆయన చూపిస్తున్న దార్శనికత అభినందనీయమన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆమె ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో కూడా ఇటువంటి వినూత్న కార్యక్రమాలు మరెన్నో చేపట్టి రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని ఆమె కోరుకున్నారు. పారిశుధ్య రంగంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ మార్పులు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.