మోదీలో రాముణ్ణి, కృష్ణుణ్ణి చూశా.
* ఆయన స్పర్శతో నా జన్మ ధన్యమైంది!’
*ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి.
* బేగంపేట విమానాశ్రయంలో ఆత్మీయ కలయిక.
* నెట్టింట వైరల్‌గా మారిన భావోద్వేగ పోస్ట్.
హైదరాబాద్, మహా.
ప్రముఖ సినీ నటుడు, దర్శక రచయిత తనికెళ్ల భరణి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకున్న అపారమైన భక్తిభావాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రిని అతి సమీపం నుంచి దర్శించుకోవడం, ఆయన కరస్పర్శను ఆస్వాదించడం తన జీవితంలో మర్చిపోలేని అద్భుత ఘట్టమని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీలో తనకు పురాణ పురుషులైన రామకృష్ణులు, భారతీయ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఆదిశంకరాచార్యులు, స్వామి వివేకానందుడు కనిపించారని పేర్కొంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారింది.
ఇటీవల హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోదీ.. తన పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సమయంలో బేగంపేట విమానాశ్రయంలో తనికెళ్ల భరణి ఆయనను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా భరణి ఎంతో భక్తిశ్రద్ధలతో నమస్కరించగా, ప్రధాని మోదీ సైతం అత్యంత ఆప్యాయంగా ఆయన చేతులు పట్టుకుని పలకరించారు. ఇందుకు సంబంధించిన అపురూపమైన ఛాయాచిత్రాన్ని భరణి తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను అక్షరబద్ధం చేస్తూ.. “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే మనమిప్పుడు వారిని చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం” అని అత్యంత భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు.
కళామతల్లి ముద్దుబిడ్డగా, ఎన్నో దశాబ్దాలుగా వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న తనికెళ్ల భరణి.. దేశ ప్రధాని పట్ల ఇంతటి ప్రగాఢమైన గౌరవాన్ని, దైవభావాన్ని ప్రదర్శించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేవుళ్లను ప్రత్యక్షంగా చూడలేకపోయినా, వారి లక్షణాలు, ఆశయాలు మూర్తీభవించిన నిస్వార్థ నాయకుడిగా మోదీని భరణి అభివర్ణించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. భరణి గారి మాటల్లో ఉన్న స్వచ్ఛత, మోదీ గారి పట్ల ఆయనకున్న అచంచలమైన విశ్వాసం నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. దేశ నాయకుడి పట్ల ఒక సామాన్యుడిలా ఆయన చూపించిన ఈ స్వచ్ఛమైన ప్రేమకు నెటిజన్లు జేజేలు పలుకుతుండటంతో.. ప్రస్తుతం ఈ ఫోటో, వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.








