Mahaa Daily Exclusive

  నిరుద్యోగ వైద్యులకు శుభవార్త…

Share

నిరుద్యోగ వైద్యులకు శుభవార్త.
* 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.
* ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల.
* 1:3 నిష్పత్తిలో అభ్యర్థులకు పిలుపు.
* 22, 23 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్.
* తుది దశకు చేరిన నియామక ప్రక్రియ.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మిగిలి ఉన్న 433 పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు (1:3 నిష్పత్తిలో) అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది.
**సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎక్కడంటే..**
ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌ వెంగల్‌రావు నగర్‌‌లోని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌’ ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. అభ్యర్థులు తమ విద్యార్హత, కమ్యునిటీ తదితర అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం హాజరు కావాలని బోర్డు సూచించింది. అనివార్య కారణాల వల్ల 22, 23 తేదీల్లో హాజరు కాలేని వారికి ఈ నెల 25న మరో అవకాశం కల్పించింది. ఆ రోజున కూడా నేరుగా వచ్చి సర్టిఫికెట్లు సమర్పించవచ్చని బోర్డు స్పష్టం చేసింది.
**మొత్తం పోస్టులు 607.. ఇప్పటికే 174 భర్తీ**
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మొత్తం 34 డిపార్ట్‌మెంట్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, అనస్థీషియా విభాగాలకు చెందిన 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. ఆయా పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇటీవలే నియామక పత్రాలను సైతం అందజేశారు.
**మిగిలిన 30 విభాగాల్లో..**
ప్రస్తుతం మిగిలిన 30 డిపార్ట్‌మెంట్లలో 433 పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదలైంది. ఇందులో మల్టీ జోన్-I పరిధిలో 264 పోస్టులు, మల్టీ జోన్-II పరిధిలో 169 పోస్టులు ఉన్నాయి. (ఉదాహరణకు జనరల్ మెడిసిన్-47, జనరల్ సర్జరీ-43, ఫార్మకాలజీ-28 పోస్టులు ఉన్నాయి).
ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే, పోస్టులకు తుది ఎంపికైన డాక్టర్ల ఫైనల్ జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.