అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసులో నిందితుడైన దొడ్డా వెంకట సత్యప్రసాద్‌కు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించి తిరస్కరించింది.
విచారణ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫున పలు అభ్యంతరాలు, సందేహాలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే కేసు దర్యాప్తు లేదా తదుపరి న్యాయ ప్రక్రియలో తలెత్తే అంశాలపై సరైన సమయంలో తగిన అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం ముందస్తు బెయిల్‌ను రద్దు చేసే పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డా వెంకట సత్యప్రసాద్‌లను అప్రూవర్‌లుగా మార్చి, తద్వారా వైఎస్ జగన్‌ను కేసులో ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కుట్ర పన్నుతున్నాయని చెవిరెడ్డి గతంలో ఆరోపించారు. ఇదే అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
అయితే ఈ దశలో పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు, భవిష్యత్తులో కేసు విచారణలో అవసరమైతే చట్టప్రకారం తగిన సమయంలో కోర్టును ఆశ్రయించవచ్చని చెవిరెడ్డికి సూచించింది. దీంతో లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు, న్యాయ ప్రక్రియ యథావిధిగా కొనసాగనున్నట్లు స్పష్టమైంది.








