Mahaa Daily Exclusive

  గులాబీ దళం..కోటి సభ్యత్వాలే లక్ష్యం…

Share

గులాబీ దళం..కోటి సభ్యత్వాలే లక్ష్యం.
* 119 నియోజకవర్గాలకు ఇంచార్జ్ లు.
* టార్గెట్ 34,000 బూత్‌లు.
* 68 వేలమంది క్రియాశీల కార్యకర్తలకు డిజిటల్ పాఠాలు.
* సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల బీమా.
* పండుగ వాతావరణంలో ప్రారంభానికి సర్వం సిద్ధం.
* సరికొత్త యాప్‌తో రంగంలోకి ఐటీ నిపుణులు.
హైదరాబాద్, మహా.

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సరికొత్తగా పునర్నిర్మించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహంతో సమరశంఖం పూరించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ పార్టీని ప్రతి ఇంటికీ చేర్చడమే ధ్యేయంగా నూతన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో సాధించిన 60 లక్షల సభ్యత్వాల రికార్డును అధిగమించి, ఈసారి ఏకంగా కోటి సభ్యత్వాల మైలురాయిని అందుకోవడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ఒక సరికొత్త, అత్యంత సురక్షితమైన డిజిటల్ అప్లికేషన్‌ను సిద్ధం చేసింది. ఈ యాప్‌కు సంబంధించిన తుది మెరుగుల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వేదికగా 119 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు, ప్రతి సెగ్మెంట్‌కు ఒకరు చొప్పున ఎంపిక చేసిన 119 మంది ఐటీ నిపుణులకు అత్యున్నత స్థాయి సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా తరగతుల్లో యాప్ నిర్వహణ, సర్వర్ కనెక్టివిటీ, ఆన్‌లైన్ డేటా వెరిఫికేషన్ వంటి కీలకమైన సాంకేతిక అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు.
**జిల్లాల్లో శిక్షణా జాతర.. వారం రోజుల పాటు వర్క్‌షాపులు**
రాష్ట్ర రాజధానిలో శిక్షణ పూర్తి చేసుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఐటీ నిపుణులు నేరుగా ఆయా జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాలకు చేరుకుంటారు. తెలంగాణవ్యాప్తంగా దాదాపు 34,000 పైచిలుకు పోలింగ్ బూత్‌లు ఉండగా.. ప్రతి బూత్‌కు ఇద్దరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,000 మందికి పైగా క్రియాశీలక కార్యకర్తలను ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. జిల్లాల్లో ఇప్పటికే పనిచేస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్థానిక నియోజకవర్గాల ఇన్ఛార్జీల సంయుక్త పర్యవేక్షణలో ఈ 68,000 మంది కార్యకర్తలకు వారం రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో పకడ్బందీగా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. మొబైల్ యాప్ ద్వారా కేవలం కొన్ని క్షణాల్లోనే సభ్యుడి ఫొటో, ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసి, డిజిటల్ రశీదును జారీ చేసే విధానంపై వీరికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఈ ప్రతిష్టాత్మక శిక్షణా కార్యక్రమాలన్నింటినీ రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు నిరంతరం మానిటరింగ్ చేస్తూ ఏరోజుకారోజు ప్రగతి నివేదికలను సేకరిస్తారు.
**అధినేత కేసీఆర్ చేతుల మీదుగా సభ్యత్వ పునరుద్ధరణ మహోత్సవం**
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68,000 మంది కార్యకర్తలకు డిజిటల్ శిక్షణ పూర్తయిన వెంటనే, సభ్యత్వ నమోదు ప్రారంభ తేదీని పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించనుంది. సభ్యత్వ నమోదు ప్రారంభమయ్యే ఆ చారిత్రాత్మక రోజున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుని ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అదేరోజున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు సహా పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులంతా తెలంగాణ భవన్‌లో సభ్యత్వాలు తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గులాబీ శ్రేణులు పండుగ వాతావరణంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పెద్ద జాతరలా నిర్వహించేందుకు శ్రేణులన్నీ సమాయత్తమవుతున్నాయి.
**కార్యకర్తలకు రూ. 2 లక్షల బీమా ధీమా.. సాధారణ సభ్యత్వానికి రూ. 50**
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తల సంక్షేమానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అగ్రతాంబూలం ఇస్తుందని ఈసారి కూడా నిరూపించింది. గతంలో మాదిరిగానే పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ. 2 లక్షల విలువైన ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తూ క్షేత్రస్థాయి శ్రేణులకు భారీ భరోసా ఇచ్చింది. ఇందుకోసం ఇన్సూరెన్స్ కంపెనీలతో పార్టీ ఇప్పటికే ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇక సభ్యత్వ రుసుము విషయానికి వస్తే.. సాధారణ సభ్యత్వానికి రూ. 50, క్రియాశీలక సభ్యత్వానికి రూ. 500 చొప్పున రుసుముగా నిర్ణయించారు. ఈ సమగ్ర డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే, పార్టీ సంస్థాగత బలోపేతంపై బీఆర్ఎస్ అధిష్ఠానం పూర్తిస్థాయిలో దృష్టి సారించనుంది.
**గ్రామ స్థాయి నుంచి కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల**
సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియడమే తరువాయిగా, గ్రామ స్థాయి నుంచి మండల, మున్సిపల్, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి వరకు ఉండేటటువంటి అన్ని రకాల పార్టీ కమిటీల నియామకానికి సంబంధించిన అధికారిక ఎన్నికల షెడ్యూల్‌ను గులాబీ అధినేత విడుదల చేయనున్నారు. ప్రకటించబడిన నిర్ణీత గడువులోనే, అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతిలో అర్హులైన, క్రియాశీలక నేతలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని కమిటీల నియామకాలను పూర్తి చేయాలని కేసీఆర్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నూతన కమిటీల నియామకం పూర్తయిన వెంటనే, పార్టీ విధివిధానాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు మరియు ప్రజా క్షేత్రంలో అనుసరించాల్సిన పోరాటాలపై కొత్తగా ఎన్నికైన ప్రతినిధులకు ప్రత్యేక రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా శిబిరాలను కూడా తెలంగాణ భవన్ వేదికగా పార్టీ ప్లాన్ చేస్తోంది.