Mahaa Daily Exclusive

  ఏఐ తో వైట్ కాలర్ కొలువులకు ముప్పు….

Share

ఏఐ తో వైట్ కాలర్ కొలువులకు ముప్పు.
* యువత బ్లూ కాలర్ ఉద్యోగాలపై దృష్టి సారించాలి.
* స్కిల్స్ ఉంటే విదేశాల్లో నెలకు రూ. 2 లక్షల వేతనం.
* నైపుణ్యాభివృద్ధికే ప్రభుత్వ పెద్దపీట.
* నాడు ఐటీ చదివితే అమెరికా.. నేడు ఏఐతో ఆ దేశానికే ముప్పు.
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
సాంకేతిక రంగంలో వస్తున్న శరవేగమైన మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, యువత తక్షణమే తమ దృక్పథాన్ని మార్చుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితులను ముందుగానే పసిగట్టి, నైపుణ్యం కలిగిన బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు యువత అడుగులు వేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌పై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
**ఏఐ భర్తీ చేయలేని బ్లూ కాలర్ జాబ్స్**
సరిగ్గా పాతికేళ్ల క్రితం 2000వ సంవత్సరంలో ఐటీ కోర్సులు చదివినా, కంప్యూటర్ నేర్చుకున్నా సులభంగా ఉద్యోగం వచ్చేదని, అమెరికా వెళ్లొచ్చనే ఒక భద్రత ఉండేదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కానీ ఈ 2026 నాటికి ప్రపంచంలో పెను మార్పులు వచ్చాయని, ఏఐ తుఫాను ధాటికి ఏకంగా అమెరికానే కొట్టుకుపోయే విపత్కర పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు పెద్ద ఎత్తున గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. అయితే, స్కిల్డ్, సెమీ-స్కిల్డ్ విభాగాలకు చెందిన బ్లూ కాలర్ ఉద్యోగాలకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉందని, రోబోలు లేదా ఏఐ టెక్నాలజీ ఈ బ్లూ కాలర్ పనులను భర్తీ చేయలేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
**ఉపాధి లేని చదువులు వ్యర్థం.. నైపుణ్యాలకే ప్రాధాన్యం**
ఏదైనా కోర్సు చదివితే కచ్చితంగా ఉద్యోగమో, ఉపాధో లభించాలని, ఆ అవకాశాలు లేని చదువులు చదివి ఎలాంటి ప్రయోజనం లేదని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. యువతలో నైపుణ్యాలను వెలికితీసి, బ్లూ కాలర్ ఉద్యోగాలకు వారిని సన్నద్ధం చేసే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని వివరించారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ప్రారంభించామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించే ఏటీసీ (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు)లుగా తీర్చిదిద్దుతున్నామని, అన్ని పాలిటెక్నిక్ కళాశాలలను సైతం అప్‌గ్రేడ్ చేస్తున్నామని వెల్లడించారు.
**జపాన్, జర్మనీ దేశాల్లో భారీ ప్యాకేజీలు**
అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకున్న యువతకు జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో అద్భుతమైన అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక్కడ ఉద్యోగ భద్రతతో పాటు నెలకు రూ. 2 లక్షల వరకు భారీ వేతనాలు అందుకోవచ్చని, జీవన ప్రమాణాలు సైతం అమెరికా కంటే మెరుగ్గా ఉంటాయని ఆయన వివరించారు. ఇంగ్లీషు భాష రాకపోయినా కేవలం తమ మాతృభాషతోనే ఈ దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయని కొనియాడారు. మన యువత అక్కడి బ్లూ కాలర్ ఉద్యోగాలను సునాయాసంగా అందిపుచ్చుకోవాలన్న ముందుచూపుతోనే, జర్మన్ మరియు జపనీస్ భాషలు నేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయా దేశాలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తుచేశారు. శరవేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులను అంచనా వేసుకుని, అంతర్జాతీయ దేశాలకు ధీటైన ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.