Mahaa Daily Exclusive

  రాష్ట్రానికి కేంద్రం భారీ నజరానా….

Share

రాష్ట్రానికి కేంద్రం భారీ నజరానా.
* రూ.5,681 కోట్ల యూసీఎఫ్ నిధులు మంజూరు.
* వరంగల్‌కు రూ.4,674 కోట్లు.. కరీంనగర్‌కు రూ.840 కోట్లు.. ఖమ్మం కారిడార్‌కు రూ.166 కోట్లు.
* కరీంనగర్ అభివృద్ధికి మహర్దశ.
* పట్టుబట్టి నిధులు సాధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.
హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్ర పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మౌలిక వసతుల కల్పన, నగరాల సుందరీకరణ లక్ష్యంగా అర్బన్ సిటీ ఫండ్ (యూసీఎఫ్) కింద రాష్ట్రానికి ఏకంగా రూ.5,681.04 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన మూడు కీలక ప్రతిపాదనలకు యూసీఎఫ్ నేషనల్ అపెక్స్ కమిటీ లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. ఇందులో వరంగల్, కరీంనగర్ నగరాల సమగ్ర అభివృద్ధితో పాటు ఖమ్మం-వరంగల్-కరీంనగర్ కారిడార్ పనులు ఉన్నాయి. ఈ నిధులతో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.
దేశవ్యాప్తంగా తెలంగాణ, ఏపీతో సహా మొత్తం ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన 17 ప్రాజెక్టులకు కేంద్రం యూసీఎఫ్ కింద ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.14,867.88 కోట్లు కాగా, అందులో సింహభాగం తెలంగాణకే దక్కడం గమనార్హం. రాష్ట్రం నుంచి వెళ్లిన మూడు ప్రాజెక్టులను పరిశీలిస్తే.. వరంగల్ మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణకు అత్యధికంగా రూ.4,674 కోట్లు, కరీంనగర్ నగర అభివృద్ధికి రూ.840 కోట్లు, అలాగే ఖమ్మం-కరీంనగర్ కారిడార్ డిజిటల్ గవర్నెన్స్ కోసం రూ.166 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. నిధుల పంపిణీ విధానం ప్రకారం, ఈ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 25 శాతం (కేంద్రం వాటా రూ.1,420.26 కోట్లు) నిధులను భరించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 50 శాతం నిధులను కేంద్రమే హడ్కో (HUDCO) రుణం రూపంలో రాష్ట్రానికి సమకూర్చనుంది. ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక లేఖ కూడా అందింది.
వాస్తవానికి, యూసీఎఫ్ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలుత కేంద్రానికి పంపిన ప్రతిపాదనల జాబితాలో కరీంనగర్ పేరు లేదు. కేవలం వరంగల్ కార్పొరేషన్ ప్రతిపాదనలు, ఖమ్మం-వరంగల్-కరీంనగర్ కారిడార్ డీపీఆర్‌లను (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) మాత్రమే రాష్ట్రం ప్రతిపాదించింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సైతం యూసీఎఫ్ జాబితాలో చేర్చాల్సిందేనని ఆయన గట్టిగా పట్టుబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న వెంటనే, నగర ఆధునీకరణకు చేపట్టాల్సిన పనులపై ఆగమేఘాల మీద ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపించారు. ఈ ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించాలని ఆయన స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ నిరంతర కృషి, పట్టుదల నేపథ్యంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశాల మేరకు.. కరీంనగర్‌ను కూడా కలుపుకుని రాష్ట్రం నుంచి వచ్చిన మూడు ప్రతిపాదనలకు జాతీయ అపెక్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధుల వరద పారనుంది. యూసీఎఫ్ ద్వారా రానున్న రూ.840 కోట్లతో నగరంలో సరికొత్త మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిధులతో కరీంనగర్‌లో అత్యాధునిక మోడల్ రోడ్లు, ప్రజల సౌకర్యార్థం స్కై వాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలను నిర్మించనున్నారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించడంతో పాటు, వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తకుండా పటిష్టమైన వరద నీటి నివారణ చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ తర్వాత అత్యంత అధునాతన సౌకర్యాలున్న సుందర నగరంగా కరీంనగర్ అవతరించనుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.