Mahaa Daily Exclusive

  అమరావతి పేరిట భారీ స్కామ్…

Share

అమరావతి పేరిట భారీ స్కామ్.
* ‘మావిగన్’ తోనే రాష్ట్రానికి మేలు.
* కూటమి పాలనలో జంగిల్ రాజ్.
* చంద్రబాబువి రాక్షస, శవ రాజకీయాలు.
* ఎన్నికల హామీలకు వెన్నుపోటు.
* సూపర్ సిక్స్ అంతా పచ్చి మోసమే.
* వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజం.

అమరావతి , మహా.

**రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, ఏమీ లేని శూన్యం నుంచి అమరావతిని నిర్మిస్తామనడం రాష్ట్ర ఖజానాకు ఉరితాడు వేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాజధాని పేరిట లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పణంగా పెట్టే బదులు, ఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ‘మావిగన్’ (విశాఖ-విజయవాడ-గుంటూరు) అనుసంధానమే ఏకైక, ఆచరణాత్మక ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కేవలం ఆరు వందల పదిహేను కోట్లతో అద్భుతమైన సచివాలయాన్ని నిర్మిస్తే.. ఏపీలో మాత్రం చంద్రబాబు సర్కార్ కేవలం ఐదు భవనాల నిర్మాణం కోసమే పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు చేస్తోందని, అందులో డిజైన్లకే నాలుగు వందల ఒక కోట్లు తగలెయ్యడం కూటమి ప్రభుత్వ భారీ స్కామ్‌కు నిదర్శనమని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో చదరపు అడుగుకు ఐదు వేల లోపు ఉన్న నిర్మాణ వ్యయాన్ని, ఇప్పుడు ఫర్నిచర్ పేరుతో ముప్పై వేలు దాటించేసి రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు**

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలకు వెన్నుపోటు పొడిచి, రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’గా మార్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే తాము ‘మావిగన్’ (విశాఖ-విజయవాడ-గుంటూరు) అనుసంధాన ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించామని జగన్ స్పష్టం చేశారు. ఏమీ లేని శూన్యం నుంచి అమరావతిని నిర్మించాలంటే రాష్ట్ర ఖజానాపై లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కేవలం ఆరు వందల పదిహేను కోట్లతో అద్భుతమైన సచివాలయాన్ని నిర్మిస్తే, చంద్రబాబు మాత్రం కేవలం ఐదు బిల్డింగుల కోసమే పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. అందులో భవన డిజైన్ల కోసమే ఏకంగా నాలుగు వందల ఒక కోట్లు తగలేశారని విమర్శించారు. గతంలో చదరపు అడుగుకు ఐదు వేల లోపు ఉన్న నిర్మాణ వ్యయాన్ని, ఇప్పుడు ఫర్నిచర్, ఇంటీరియర్ పేరుతో చదరపు అడుగుకు ముప్పై వేలు దాటించేసి భారీ కుంభకోణానికి తెరలేపారని జగన్ ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీది మొదటి నుంచి గొడ్డలి, గన్ కల్చర్ అని వైఎస్ జగన్ విమర్శించారు. జాతర గొడవల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దస్తగిరి చనిపోతే, ఆ నెపాన్ని కూడా తమ పార్టీకి అంటగట్టేందుకు అడ్డగోలు కథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. తమ కుటుంబం ఎప్పుడూ బాధితుల పక్షమే తప్ప, తాము వేటగాళ్లం కాదని స్పష్టం చేశారు. తన తాత రాజారెడ్డి గారిని చంపింది టీడీపీ వాళ్లేనని, తన తండ్రి వైఎస్సార్ మృతిపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి లాయర్, చంద్రబాబు లాయర్ ఇద్దరూ ఒక్కరేనని, దీన్ని బట్టే క్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో స్పష్టంగా అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వంగవీటి రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడైన వెలగపూడి రామకృష్ణకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, అలాగే నందమూరి బాలకృష్ణ కాల్పుల ఉదంతాలను చూస్తే చంద్రబాబు రాక్షస రాజకీయాలకు అవి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని మండిపడ్డారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారని, ఎన్నికల ముందు ఊదరగొట్టిన ‘సూపర్ సిక్స్’ హామీలు పూర్తిగా మోసాలుగా తేలిపోయాయని జగన్ ఎద్దేవా చేశారు. తాము ఐదేళ్ల పాటు అందించిన సంక్షేమ పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిలిపివేసిందని, పంటలకు కనీస గిట్టుబాటు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ లేక రైతన్నలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు పదిహేను వందల రూపాయల ఆడబిడ్డ నిధి, మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదని, ఈ రెండేళ్ల కాలంలో ఒక్కో నిరుద్యోగికి బాబు డెబ్భై రెండు వేల రూపాయలు బాకీ పడ్డారని ఆయన లెక్కలతో సహా వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయకపోగా, ఆ పథకాన్ని నాశనం చేస్తూ పన్నెండు ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువచ్చి ఉచిత బస్సు పథకాన్ని అటకెక్కించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో అరవై ఆరు లక్షల మందికి ఠంచనుగా పెన్షన్లు అందిస్తే, బాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా ఆరు లక్షల పెన్షన్లను అకారణంగా తొలగించారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జనాభా పెరగాలని, దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు ఇస్తున్న పిలుపును జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబుకు ఒక్కడే కొడుకు ఉన్నారని, లోకేష్‌కు కూడా ఒక్కడే కొడుకు అని, కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ముగ్గురు, నలుగురిని కనాలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మహిళలను కేవలం పిల్లలు కనే యంత్రాలుగా చూస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. తమ పాలనలో మేనమామలా విద్యాదీవెన, గోరుముద్ద అందించి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తే, నేడు కూటమి పాలనలో సరైన పౌష్టికాహారం అందక విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రతి కాలేజీలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నా పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, కంటెంట్‌ను సెన్సార్ చేస్తూ అణచివేతకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బహుశా చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని, ఈ వయసులో కూడా కనీస విలువలు లేని దౌర్భగ్యపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని జగన్ తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేస్తుందని ఆయన ప్రజలకు స్పష్టం చేశారు.