Mahaa Daily Exclusive

  కేటీఆర్ అసలు మనిషేనా.. ఇదేం పైశాచిక శాడిజం…

Share

కేటీఆర్ అసలు మనిషేనా.. ఇదేం పైశాచిక శాడిజం.
* మైనర్ బాలికను అడ్డుపెట్టుకుని ఇంత నీచమైన రాజకీయాలా?
* ఆ పసిపిల్ల ఫోటోలు బజారుకీడ్చడానికి కనీస సిగ్గులేదా?
*నీ బావమరిది డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికితే ఏం చేశారు?
* బాలిక వయసును నిర్ధారించడానికి నువ్వెవరు?
* ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగమే నడుస్తోందని పగటి కలలు కంటున్నావా?
* జడ్జిలా ఫీలైపోతున్న కేటీఆర్‌పై సీఎం రేవంత్ నిప్పులు.
* నడిరోడ్డుపై పట్టుకుంటే లొంగుబాటా?
* ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా?
* గులాబీ నేతల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర ధ్వజం.

హైదరాబాద్, మహా.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాటల సునామీ సృష్టించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అనుసరిస్తున్న తీరుపై, ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడ్డారు. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో ప్రభుత్వాన్ని, పోలీసులను టార్గెట్ చేస్తూ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఒక అత్యంత సున్నితమైన కేసును అడ్డుపెట్టుకుని, ఒక పసిపిల్ల జీవితాన్ని బలిపీఠం ఎక్కించి కేటీఆర్ దారుణమైన శవ రాజకీయాలకు తెరలేపారని, అధికార దాహంతో ఆయన కళ్లు పూర్తిగా మూసుకుపోయాయని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “అసలు కేటీఆర్ మనిషేనా? ఒక ఆడపిల్ల.. అందులోనూ చట్టం దృష్టిలో మైనర్ బాలిక అయిన ఒక పసిపిల్ల జీవితంతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన కేసులో ఆ అమ్మాయి ఫొటోలను సోషల్ మీడియాలో, పబ్లిక్ డొమైన్‌లో బయటకు ఇస్తారా? ఒక పసిపిల్లను అడ్డుపెట్టుకుని ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారా? దీన్ని రాజకీయాలకు వాడుకోవడం కంటే ఘోరమైన పైశాచిక శాడిజం సమాజంలో ఇంకొకటి ఉంటుందా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంధించిన వాగ్బాణాలు గులాబీ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో బీఆర్ఎస్ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, చట్టాలను సైతం తమ చేతుల్లోకి తీసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ముఖ్యంగా కేటీఆర్ తీరు అత్యంత అహంకారపూరితంగా, ద్వంద్వ ప్రమాణాలతో కూడుకుని ఉందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. “గతంలో కేటీఆర్ సొంత బావమరిది రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోతే.. అప్పుడు కూడా మా పోలీసులు చట్టప్రకారం నోటీసులు ఇచ్చి విచారించారు. ఇప్పుడు బండి భగీరథ్‌పై ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి, నోటీసులు ఇచ్చి పక్కాగా అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. మా ప్రజా ప్రభుత్వంలో చట్టం ముందు ఎవరైనా సమానులే. ఇక్కడ ఎవరికీ చుట్టపుచూపు ఉండదు. కానీ ఆ అమ్మాయి వయస్సును నిర్ధారించడానికి అసలు ఈ కేటీఆర్ ఎవరు? ఆమె మైనరా కాదా అని తేల్చాల్సింది కోర్టులు, డాక్టర్లు. బాలిక వయసును నిర్ధారించే బాధ్యత కేటీఆర్‌కు ఎవరు ఇచ్చారు? చట్టం నిర్ధారిస్తుందా లేక కేటీఆర్ నిర్ధారిస్తారా?” అంటూ ఆయన సూటిగా నిలదీశారు. బండి సంజయ్‌కి, కేటీఆర్‌కి మధ్య పాత రాజకీయ పంచాయతీలు ఏవైనా ఉంటే అవి పబ్లిక్‌గా వేరే చోట తేల్చుకోవాలి కానీ, వారి పంతాల కోసం ఒక మైనర్ బాలిక ప్రాణ సంకటాన్ని తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాడుకోవడం కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమని ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన విషయాన్ని కేటీఆర్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని, ఆ అక్కసుతోనే వ్యవస్థలపై బురదజల్లుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. “ఇప్పటికీ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగమే నడుస్తోందని, తాము ఆడిందే ఆట పాడిందే పాట అని కేటీఆర్ పగటి కలలు కంటున్నట్లున్నాడు. అందుకే ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ తనను తాను ఏకంగా ఒక సుప్రీంకోర్టు జడ్జిగా ఊహించుకుంటూ రోజుకో తీర్పు ఇస్తున్నాడు. నేరస్తులెవరు, బాధితులెవరు అన్నది కోర్టులు తేలుస్తాయి.. కానీ కేటీఆర్ మాత్రం తాను జడ్జి అయిపోయినట్లు మాట్లాడుతున్నాడు. ఇక వారి పార్టీ నాయకుడు, మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఏకంగా ఈ కేసుకు తానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐవో) అయినట్లుగా ఫీలవుతూ ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళిద్దరికీ ఏమైనా అవగాహన ఉందా?” అంటూ రేవంత్ అత్యంత తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. దర్యాప్తు సంస్థల పనితీరును ప్రభావితం చేసేలా గులాబీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే, దానిని ‘లొంగుబాటు’గా ప్రచారం చేస్తూ కేటీఆర్ అండ్ కో ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. “మా పోలీసులు దర్యాప్తు చేసి మాకు ఇచ్చిన నివేదిక మేరకే నేను మాట్లాడుతున్నాను. బండి భగీరథ్‌ను పోలీసులు పక్కాగా అరెస్ట్ చేశారు. ఎవరైనా నిజంగా లొంగిపోవాలి అనుకుంటే, నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్‌లోనో లేక ఇంట్లోనో అధికారులకు అప్పగిస్తారు. కానీ నడిరోడ్డు మధ్యలో పారిపోతుంటే పట్టుకుంటే లొంగుబాటు అని ఎలా అంటారో కేటీఆర్‌కే తెలియాలి. ఇలాంటి కుతర్కాలు చేయడం ఆయనకే చెల్లింది” అని సీఎం కౌంటర్ ఇచ్చారు. ఏ కేసులో అయినా పోలీసులకు ఒక ప్రొసీజర్ ఉంటుందని, దానికి లోబడే మా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు ఫైల్ చేసి, నిబంధనల ప్రకారం కచ్చితంగా 24 గంటల్లోపు ఆ మైనర్ బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని, సున్నితమైన సమస్యను చట్టపరిధిలో అంతే సున్నితంగా, పారదర్శకంగా పరిష్కరిస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఇందులో ఎవరి రాజ్యాంగం, ఎవరి పంచాయతీ నడవదని, బాధితులకు న్యాయం జరగడమే అంతిమ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.