కమల దళం కదన కుతూహలం.
* నేడు తెలంగాణ బీజేపీ కీలక భేటీ.
* రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం.
*భవిష్యత్ కార్యాచరణ, ప్రజా ప్రతినిధుల పాత్రపై దిశానిర్దేశం చేయనున్న అభయ్ పాటిల్.
* వచ్చే నెలలో రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.
* 10 జిల్లాల నూతన కార్యాలయాల ప్రారంభం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అడుగులు వేగవంతం చేసింది. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే దిశగా తెలంగాణ బీజేపీ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం సరిగ్గా 9 గంటలకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అత్యంత కీలకమైన సమావేశం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పొలిటికల్ ఇంచార్జ్ అభయ్ పాటిల్ నేతృత్వంలో జరగనున్న ఈ అత్యున్నత స్థాయి భేటీకి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు, త్వరలో జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధుల (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) పాత్ర ఎలా ఉండాలనే దానిపై పొలిటికల్ ఇంచార్జ్ అభయ్ పాటిల్ వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ చేర్చడం ద్వారా సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేసేలా కార్యాచరణ పక్కాగా రూపొందించనున్నారు.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. వరుసగా హైకమాండ్ పెద్దల పర్యటనలతో రాష్ట్ర బీజేపీ నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నెల 10వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో భారీగా జోష్ నింపిన విషయం తెలిసిందే. ఆ ఉత్సాహం ఏమాత్రం తగ్గకముందే, వచ్చే నెల (జూన్) మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన రాక పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది.
వచ్చే నెల మొదటి వారంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి ఆయన భవిష్యత్ పోరాటాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా, తెలంగాణవ్యాప్తంగా పార్టీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా, నూతనంగా నిర్మించిన పది జిల్లాల బీజేపీ కార్యాలయాలను నితిన్ నబీన్ తన చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించనున్నారు. వరుసగా జాతీయ స్థాయి అగ్రనేతలు రాష్ట్రానికి వస్తుండటం, సంస్థాగత నిర్మాణాలపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించడంతో తెలంగాణ రాజకీయాల్లో కమలనాథుల వ్యూహాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.








