- ఆకునూరి మురళి సంచలన నిర్ణయం
- తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా
- 4 నెలల పదవీకాలం ఉండగానే తప్పుకున్న మురళి
హైదరాబాద్, మహా : తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. మురళి హఠాత్ నిర్ణయం వెనుక కీలక అంశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆకునూరి మురళిని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవిని ఇచ్చింది. అయితే తెలంగాణ విద్యా శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సంబంధించి.. ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం గత కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తూ పలు కీలక సిఫార్సులను సూచించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆకునూరి మురళి రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుకు పంపించారు. ఈ సందర్భంగా విద్యా కమిషన్ ఛైర్మన్ పదవిని తనకు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఆకునూరి మురళి ధన్యవాదాలు చెప్పారు. తనకు ఇచ్చిన పనిని పూర్తి చేశానని.. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ రాజీనామా లేఖలో ఆకునూరి మురళి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్‌గా విద్యా శాఖలో చేపట్టాల్సిన మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసినట్లు ఆకునూరి మురళి వెల్లడించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు.. ఈ విద్యా రంగంలో తీసుకురాల్సిన సంస్కరణల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దానికి ఆకునూరి మురళిని ఛైర్మన్‌గా నియమించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై నిరంతరం కీలక వ్యాఖ్యలు చేసే ఆకునూరి మురళి.. విద్యా రంగంలో కీలక మార్పుల కోసం పలు సిఫార్సులు చేశారు. ఈ క్రమంలోనే పదవీ కాలం పూర్తి కాకుండానే ఆయన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆకునూరి మురళి సేవలను ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్న వేళ.. ఆయన రాజీనామా చేయడం గమనార్హం.








