- 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల బీఆర్ఎస్ నేత
- మహిళా కమిషన్ ను ఆశ్రయించిన యువతి
- విచారణ చేయాలని డీజీపీకి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్, మహా : ఇటీవల 18 ఏళ్ల యువతిని 45 ఏళ్ల ఓ బీఆర్ఎస్ నేత.. బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు వార్త రావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అప్పులు చెల్లించడం కోసం.. యువతి తండ్రి, సవతి తల్లి ఆ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినట్లు బాధితురాలు మహిళా కమిషన్‌ను ఆశ్రయించి.. ఫిర్యాదు చేయడం, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం సందర్భంగా ఒక రిపోర్టర్ సీఎం దృష్టికి తీసుకురావడం, ఈ వ్యవహారంపై తనకు అవగాహన లేదని చెప్పిన సీఎం దీనిపై విచారణ చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌కు ఆదేశాలు ఇవ్వడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కక్కెర్ల రాకేష్ గౌడ్ శాంతి దంపతులకు లహరి అనే 18 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే కక్కెర్ల రాకేష్ గౌడ్.. గత కొన్నేళ్ల క్రితం శాంతితో గొడవల కారణంగా ఆమెను వదిలేశాడు. ఈ క్రమంలోనే రేణుక అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే కక్కెర్ల రాకేష్ గౌడ్‌కు భారీగా అప్పులు అయ్యాయి. రూ.20 లక్షల అప్పులు ఉండటంతో.. డబ్బులు ఇచ్చిన వారు చెల్లించాలని అతడిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో చేసేదేమీ లేక.. బీఆర్ఎస్ నేత ఆవుల ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి వద్దకు వెళ్లి తన అప్పుల గోడును వెళ్లబోసుకున్నాడు. అయితే రాకేష్ గౌడ్ పరిస్థితి చూసిన ప్రశాంత్ రెడ్డి.. అతని 18 ఏళ్ల కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని, అలా చేస్తే అప్పులు మొత్తం తీర్చేస్తానని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రాకేష్ గౌడ్, రేణుక దంపతులు అప్పులు తీర్చడం కోసం ఈ కండిషన్‌కు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని బాధితురాలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ పెళ్లికి ఆ యువతి నిరాకరించింది. దీంతో అప్పులు ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశంతో ఉన్న యువతి తండ్రి, సవతి తల్లి.. ఆమెను పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. చివరికి పెళ్లికి ఒప్పుకోకపోతే విషం ఇచ్చి చంపేస్తామంటూ బెదిరించినట్లు ఆ యువతి ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈనెల 8వ తేదీన జనగామ జిల్లా పెంబర్తికి చెందిన బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యుడు ఆవుల ప్రశాంత్ రెడ్డితో.. ఆ యువతి పెళ్లిని జీడికల్ ఆలయంలో జరిపించినట్లు యువతి తెలిపింది. పెళ్లి అయిన తర్వాత అంటే.. ఈనెల 9వ తేదీన ఆ యువతి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో తన భార్య బంగారం, డబ్బుతో పారిపోయినట్లు ప్రశాంత్ రెడ్డి.. జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఎలాగోలా హైదరాబాద్‌కు చేరుకున్న యువతి.. ఈ నెల 17వ తేదీన మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. తండ్రి, సవతి తల్లి కలిసి డబ్బు కోసం తనకు ఇష్టం లేని పెళ్లిని చేశారని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలని మహిళా కమిషన్ ముందు మొరపెట్టుకుంది.
ఇక తన భార్య పారిపోయిందని ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తుండగానే.. యువతి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. అయితే.. ఆ యువతి మైనర్‌గా ఉన్నప్పుడే.. 2025లో వేరే వ్యక్తితో కులాంతర వివాహం చేసుకోబోయిందని.. అది తెలిసి అధికారులు చేరుకుని ఆ పెళ్లిని నిలిపివేశారని తెలుస్తోంది.








