కామాంధుల పాలిట సింహస్వప్నం.
* రెండేళ్లలో 150 మందికి కఠిన శిక్షలు.
* చిన్నారులపై అకృత్యాలకు చెక్.
* పోక్సో కోర్టుల సత్వర తీర్పులతో బాధితులకు భరోసా.
* మైనర్లపై అఘాయిత్యాల కేసుల్లో రంగారెడ్డి న్యాయస్థానం రికార్డు.
రంగారెడ్డి, మహా
సమాజంలో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు నానాటికీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారులపై అకృత్యాలకు సంబంధించి పోక్సో కేసులు నమోదు అవుతూనే ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఈ కేసుల్లో అరెస్టవుతున్న నిందితుల్లో అధికశాతం మంది సమీప బంధువులు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, పరిచయం ఉన్న వ్యక్తులు, ప్రేమికులే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మైనర్ బాలికలపై లైంగిక దాడి చేయాలంటేనే కామాంధులు వణికిపోయేలా దోషులకు కఠిన శిక్షలు విధిస్తూ, చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
**బాధితులకు భరోసా.. దోషులకు వణుకు**
పద్దెనిమిదేళ్ల (18) లోపు ఉన్న బాలబాలికలను లైంగిక వేధింపులు, క్రూరమైన నేరాల నుంచి రక్షించేందుకు, అలాగే బాధితులకు త్వరితగతిన న్యాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2012లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పోక్సో)ను ప్రత్యేకంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం కింద నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించి దోషులకు శిక్షలు ఖరారు చేసేందుకు ప్రతి జిల్లాలోనూ స్పెషల్ పోక్సో కోర్టులతో పాటు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను సైతం ఏర్పాటు చేశారు. ఫలితంగా విచారణ ప్రక్రియ వేగవంతమై, నిందితులకు కఠిన శిక్షలు పడుతుండటంతో బాధితులకు సత్వర న్యాయం అందుతోంది.
**రంగారెడ్డి కోర్టు సంచలన రికార్డు.. రూ.3 కోట్లకు పైగా పరిహారం**
ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని ప్రత్యేక పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అరుదైన రికార్డు సృష్టించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా 150 కేసుల్లో నేరం రుజువు చేసి నిందితులకు కఠిన శిక్షలను విధించింది. రెండేళ్ల క్రితం ఈ పోక్సో కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి పద్మావతి, కేసుల విచారణలో అనూహ్యమైన వేగం పెంచారు. నిందితులకు అత్యంత త్వరితగతిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తూ బాధిత పక్షానికి కొండంత అండగా నిలుస్తున్నారు. కేవలం శిక్షలు విధించడమే కాకుండా, బాధితుల పునరావాసానికి సంబంధించి అన్ని కేసుల్లో కలిపి ఇప్పటివరకు సుమారు రూ.3 కోట్లకు పైగా పరిహారాన్ని మంజూరు చేశారు. బాధితులకు ఈ పరిహారం త్వరగా అందేలా తక్షణ చర్యలు చేపట్టాలంటూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఎప్పటికప్పుడు స్పష్టమైన ఆదేశాలను సైతం జారీ చేస్తున్నారు.
**జైలు గోడల మధ్యే జీవితం.. శిక్షల వివరాలివే**
ఈ రెండేళ్ల కాలంలో న్యాయస్థానం విధించిన శిక్షల వివరాలను పరిశీలిస్తే.. పది మంది కామాంధులకు తమ సహజ జీవిత కాలం (తుదిశ్వాస విడిచే వరకు) జైలులోనే గడిపేలా కోర్టు కఠిన శిక్షలు ఖరారు చేసింది. మరో 15 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, ఏకంగా 35 మంది నిందితులకు ఇరవై ఏళ్ల సుదీర్ఘ కారాగార వాసాన్ని శిక్షగా వేసింది. అదేవిధంగా 17 మందికి పదేళ్ల జైలు శిక్ష, ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష, 19 మందికి ఐదేళ్ల శిక్ష, 31 మందికి మూడేళ్ల జైలు శిక్ష, 12 మందికి రెండేళ్ల కారాగార శిక్షలు అమలు చేసింది. మరో తొమ్మిది మందికి ఏడాది పాటు జైలు శిక్షలు విధిస్తూ సంచలన తీర్పులు వెలువరించింది.
**సైగలు చేసినా, అసభ్యకర మెసేజ్‌లు పంపినా నేరమే!**
పోక్సో చట్టం కింద నేరం నిరూపణ అయినట్లయితే కోర్టులు ఏమాత్రం కనికరం లేకుండా కఠిన శిక్షలు విధిస్తాయి. ముఖ్యంగా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు ఇలాంటి నేరాలకు పాల్పడినా, లేదా దివ్యాంగులైన చిన్నారులపై అకృత్యాలకు ఒడిగట్టినా దానిని అత్యంత తీవ్రమైన దాడిగా కోర్టులు పరిగణిస్తాయి. ఇటువంటి కేసుల్లో శిక్ష తీవ్రత మరింత కఠినంగా ఉంటుంది. కేవలం చిన్నారులను అసభ్యకరంగా తాకడం, శారీరకంగా వేధించడం మాత్రమే కాకుండా.. వారి పట్ల దూషణ వ్యాఖ్యలు చేసినా, ఇబ్బంది పెట్టేవిధంగా ఫోన్ చేసి మాట్లాడినా, అసభ్యకర మెసేజ్‌లు పంపినా, చివరకు అసభ్య సైగలు చేసినా సరే పోక్సో చట్టం కింద కఠిన కేసులు నమోదు చేస్తారు. అలాగే చిన్నారులకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలను చిత్రీకరించడం, వాటిని మొబైల్ ఫోన్ల ద్వారా ఇతరులకు పంపడం అనేది అత్యంత తీవ్రమైన నేరం కింద పరిగణించబడుతుంది.
పాల్పడిన నేరం తీవ్రతను బట్టి ఈ చట్టం కింద కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా జీవిత ఖైదు వరకు శిక్షలు పడేందుకు అవకాశం ఉంటుంది. ఈ కేసుల విచారణ సమయంలో బాధితుల గోప్యతను కచ్చితంగా కాపాడతారు. చిన్నారులకు సంబంధించిన ఎలాంటి వివరాలు, పేర్లు, ఫొటోలు బహిర్గత పర్చకూడదనే కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా పోక్సో చట్టం కింద పక్కాగా ఆధారాలతో దొరికితే నిందితులు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుంచి తప్పించుకోలేరని న్యాయస్థానాల తాజా తీర్పులు స్పష్టం చేస్తున్నాయి.








