దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రా.
* పోక్సో నిందితుడికి సీఎం రక్షణ.
* ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.
* గన్నీ బ్యాగులు లేవు కానీ గన్నులు దొరుకుతున్నాయి.
* కాంగ్రెస్, బీజేపీల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్.
హైదరాబాద్, మహా.
రేవంత్ రెడ్డికి ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల బరిలో తేల్చుకోవాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ రక్షణను, ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ ఘోర వైఫల్యాన్ని, కాంగ్రెస్ నేతల భూకబ్జాలను ఎండగడుతూ ,గన్నీ బ్యాగులు దొరకడం లేదు కానీ, రాష్ట్రంలో గన్నులు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన మీడియా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపింది. అధికార కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ పార్టీల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, శాంతిభద్రతల వైఫల్యం, అలాగే బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించిన వైఖరిని కేటీఆర్ ఎండగట్టారు. ఇదే సమయంలో, గల్ఫ్ దేశాలలో ఉపాధి కోసం వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ కార్యక్రమం ద్వారా ప్రత్యేక కార్యాచరణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
**కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందం**
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే, న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నిందితుడిని తొమ్మిది రోజుల పాటు కాపాడిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలతోనే నిందితుడిని సీఎం బంధువులకు చెందిన మెడికవర్ ఆసుపత్రిలోని 28వ అంతస్తులో అత్యంత రహస్యంగా దాచారని ఆరోపించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతోనే రేవంత్ రెడ్డి అరెస్ట్ డ్రామాలు, బండి సంజయ్ లొంగుబాటు నాటకాలు ఆడించారని విమర్శించారు. బాధితురాలి వివరాలను సోషల్ మీడియాలో బయటపెట్టిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ దారుణాన్ని ‘హనీ ట్రాప్’ అంటూ అడ్డగోలు కథనాలు రాసిన మీడియా సంస్థలపైనా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. నిందితుడిని దాచిపెట్టిన బండి సంజయ్ తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ పట్టుబట్టారు. ఈ సున్నితమైన కేసులో మైనర్ బాలికకు న్యాయం జరిగేలా పోరాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
**శ్వేతపత్రం విడుదల చేయాలి**
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 30 నుంచి 35 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని, కానీ ముఖ్యమంత్రి 80 శాతం, మంత్రులు 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దామని, 80 శాతం పంట కొనుగోళ్లు జరిగాయని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతులకు కావాల్సిన గన్నీ బ్యాగులు దొరకడం లేదని, కానీ నేరగాళ్లకు కావాల్సిన గన్నులు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని శాంతిభద్రతల క్షీణతను ఎద్దేవా చేశారు. తక్షణమే కేబినెట్ సమావేశం నిర్వహించి, పంట కొనుగోళ్లపై పంటల వారీగా లెక్కలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ప్రధాని మోదీ పర్యటనను ప్రస్తావిస్తూ, రైతులు యూరియా వాడకం తగ్గించాలని, ప్రజలు బంగారం కొనడం తగ్గించాలని ఉచిత సలహాలు ఇచ్చి, రాష్ట్ర ప్రజలకు ప్రధాని ‘చావు కబురు చల్లగా చెప్పారని’ కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి భూ దోపిడీ మీద ఉన్న శ్రద్ధ, భూమిని నమ్ముకున్న రైతుల మీద లేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా భూములను ఆక్రమిస్తున్నారని, వేం నరేందర్ రెడ్డి ‘భూ హారతి’ పేరుతో కేసముద్రంలో అసైన్డ్ భూములను ఆక్రమించారని ఆరోపించారు. శంషాబాద్‌లో సీఎం అనుచరులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఏకంగా 90 ఎకరాల సీలింగ్ భూమిని కేటాయించుకుని వేల కోట్ల రూపాయల దందాకు తెరలేపారని ఆయన దుయ్యబట్టారు. తన బావమరిది ఫామ్‌హౌస్ పై డ్రగ్స్ దాడి జరిగిందంటూ సీఎం చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అక్కడ ఏమీ దొరకలేదని స్వయంగా ప్రభుత్వ అధికారులే తేల్చిచెప్పారని గుర్తు చేశారు. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి నిజంగా అంత ధైర్యం, దమ్ము ఉంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అది చేతకాకపోతే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ భయపడదని, ధైర్యంగా ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.








