కాక్రోచ్ జనతా పార్టీ’పై కేంద్రం నిఘా.
* ఒకేసారి అన్ని ఖాతాల నిలిపివేత.
* హ్యాకింగ్, బెదిరింపులపై రగడ.
* జాతీయ భద్రత పేరిట ఎక్స్ అకౌంట్ నిలిపివేత.
* చంపేస్తామంటూ వ్యవస్థాపకుడికి హెచ్చరికలు.
ఢిల్లీ, మహా.
భారతీయ సోషల్ మీడియా వేదికలపై గత కొన్ని రోజులుగా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో విపరీతమైన ట్రెండ్ సృష్టించిన వ్యంగ్య రాజకీయ వేదిక “కాక్రోచ్ జనతా పార్టీ” పై డిజిటల్ అణిచివేత తీవ్ర రూపం దాల్చింది. నిరుద్యోగం, యువత సమస్యలపై వ్యంగ్యాస్త్రాలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ వర్చువల్ కూటమికి ఊహించని విధంగా భారీ షాక్ తగిలింది. ఈ వినూత్న డిజిటల్ ప్రచార వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం నాడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, తమ సమూహంపై వ్యవస్థీకృత అణిచివేత చర్యలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. ఒకేసారి కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పాటు, ఆయన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయని, ప్రస్తుతం తమకు ఏ ఒక్క సోషల్ మీడియా వేదికకు యాక్సెస్ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ డిజిటల్ పేజీని అడ్డుకోవడానికి కొందరు కావాలనే తమ ఐడీలను హ్యాక్ చేశారని, ఇకపై ఈ ఖాతాల నుండి వచ్చే ఏ ఒక్క ప్రకటనను కూడా అధికారికంగా భావించవద్దని ఆయన స్పష్టం చేశారు.
ఈ వివాదం వెనుక బలమైన రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలు ముడిపడి ఉన్నట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ‘నీట్ యూజీసీ 2026’ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం ఒక పెద్ద ఎత్తున ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ఊపందుకున్న కొన్ని గంటల్లోనే వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. ఖాతాను తక్షణమే మూసివేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వచ్చిన బెదిరింపుల స్క్రీన్ షాట్లను ఆయన పంచుకున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నివసిస్తున్న తన తల్లిదండ్రుల నివాసానికి కూడా కొందరు అపరిచిత వ్యక్తులు వెళ్లి హెచ్చరికలు జారీ చేశారని, దీంతో తన కుటుంబ భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆయన జాతీయ మీడియాతో పేర్కొన్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన ఎక్స్ ఖాతాను ఇప్పటికే భారత పరిధిలో నిలిపివేసినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఈ వ్యంగ్య ఖాతా పోస్ట్ చేస్తున్న కంటెంట్ దేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు భంగం కలిగించేలా యువతను రెచ్చగొడుతోందని నిఘా వర్గాలు భావించడమే ఇందుకు ప్రధాన కారణం. కాగా, ఈ ‘బొద్దింకల పార్టీ’ పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంగా నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి వచ్చే వారిని ఉద్దేశించి “సమాజానికి పట్టిన పరాన్నజీవులు, బొద్దింకలు” అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. సీజేఐ తర్వాత దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ, అప్పటికే బోస్టన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిజిటల్ క్యాంపెయినింగ్ విభాగంలో పనిచేసిన అభిజిత్ దీప్కే ఆ వ్యాఖ్యలను వ్యంగ్యంగా మలుస్తూ “నిరుద్యోగులు, సోమరిపోతుల గొంతుక” అనే ట్యాగ్‌లైన్‌తో మే 16న ఈ సరికొత్త వ్యంగ్య పార్టీని డిజిటల్ వేదికపై స్థాపించారు.
కేవలం వారం రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకుని, సుమారు 3.5 లక్షల మంది ఆన్‌లైన్ సభ్యత్వాలను నమోదు చేసుకోవడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వ్యూహాత్మక ఎదుగుదల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ లేదా తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాల తెరవెనుక మద్దతు ఉందనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పేజీకి వస్తున్న మిలియన్ల కొద్దీ ఫాలోవర్లలో అత్యధికులు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల నెట్‌వర్క్‌కు చెందిన వారేనని కొందరు మాజీ పౌర అధికారులు మరియు విమర్శకులు వాదిస్తున్నారు. ఈ వ్యంగ్య ఉద్యమం ఒక స్వతంత్ర పౌర వేదిక కాదు గానీ, పక్కా రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న ‘కోవర్ట్ ప్రాజెక్ట్’ అని వారు విమర్శిస్తుండగా, ప్రభుత్వం మరియు హ్యాకర్లు ఒకేసారి తమపై ఉక్కుపాదం మోపడాన్ని భావప్రకటన స్వేచ్ఛను అణచివేయడమేనని అభిజిత్ దీప్కే మద్దతుదారులు వాదిస్తున్నారు.






