మేడ్చల్ జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హఠాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో శామీర్‌పేట ఎమ్మార్వో (తహసీల్దార్) సుచరిత ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అందిన పక్కా సమాచారంతోనే అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ దాడి నేపథ్యంలో ఎమ్మార్వో సుచరితపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులతో చేతులు కలిపి బొమ్మరాస్పేట్ పరిధిలో పెద్ద ఎత్తున వివాదాస్పద భూములను ఆమె క్లియర్ చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, భారీగా లంచాలు తీసుకుని ఈ భూముల వ్యవహారాలను చక్కబెట్టారనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎమ్మార్వో సుచరితతో పాటు ఈ అక్రమాల్లో భాగస్వామ్యమున్న ఇతర సిబ్బంది పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. భూములకు సంబంధించిన కీలక రికార్డులను, ఫైళ్లను ఏసీబీ బృందం స్వాధీనం చేసుకుని పరిశీలిస్తోంది.








