Mahaa Daily Exclusive

  సైబర్ నేరస్థుల ఉచ్చులో నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ జస్ట్ మిస్

Share

  • ఆర్థిక శాఖ అదనపు కర్యదర్శి దిలీప్ నంటూ పరిచయం చేసుకున్న కేటుగాడు
  • డిప్యూటీ సీఎం పీఏకు ఫోన్ చేసి నిర్ధారించుకున్న రాజాసింగ్
  • ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని రాజాసింగ్ హెచ్చరిక

హైదరాబాద్, మహా : సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు చాలామందిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను లక్ష్యంగా చేసుకుని కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని ఒక గుర్తు తెలియని వ్యక్తి మోసానికి తెరలేపగా, అప్రమత్తమైన రాజాసింగ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఫేక్ కాల్ ఉదంతంపై ఆయన స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి వివరాలు వెల్లడించారు. రాజాసింగ్ తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం సాయంత్రం ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ సెక్రటరీ దిలీప్ కుమార్‌ని అంటూ పరిచయం చేసుకున్నాడు. “ప్రధాన మంత్రి వికసిత్ భారత్” పథకం కింద తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని, దీని ద్వారా నియోజకవర్గ యువతకు 50 శాతం సబ్సిడీతో రూ.10 లక్షల రుణాలు ఇస్తామని నమ్మబలికాడు. అన్నింటిలో ముందుండే మీరు ఈ స్కీమ్‌కు ఎందుకు అప్లై చేయలేదని ప్రశ్నిస్తూ ఇవాళ రాత్రిలోపే ఆధార్ కార్డ్ వివరాలు పంపాలని ఒత్తిడి చేశాడు.

ఈ గడువు విధింపుతో అనుమానం వచ్చిన రాజాసింగ్ వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఏకు ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకున్నారు. ఆర్థిక శాఖలో దిలీప్ కుమార్ అనే అధికారి ఎవరూ లేరని, అసలు అలాంటి స్కీమే లేదని తేలడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. నియోజకవర్గ ప్రగతి కోసమని ఆశపడి ప్రజాప్రతినిధులు ఇలాంటి మోసాల బారిన పడే ప్రమాదం ఉందని, రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని రాజాసింగ్ హెచ్చరించారు. ఈ సైబర్ నేరగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని రాజాసింగ్ కోరారు.