Mahaa Daily Exclusive

  జైలు జీవితం కూడా వస్తే ఆత్మకథకు పరిపూర్ణత.

Share

  •  ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలనం.
  •  వివాదం ముగిసిందని జనసేన ప్రకటించినా వీడని ఉత్కంఠ.

    హైదరాబాద్, మహా.
    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, చట్టపరమైన చర్య ఎదుర్కొనేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాను ఎలాంటి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించబోనని తేల్చిచెప్పడం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    తనపై కేసు నమోదైన మరుసటి రోజే అరెస్ట్ చేస్తారనే సమాచారం తనకందిందని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. తానేమీ ఎక్కడికీ పారిపోవడం లేదని, తన ఇంట్లోనే అందుబాటులో ఉంటానని స్పష్టం చేస్తూ, ధైర్యంగా అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. ఇప్పటివరకు తాను ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదని, భవిష్యత్తులోనూ వేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అలాగే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని, చట్టాన్ని ఎదుర్కోవడానికి తానేమీ వెనుకాడటం లేదని పునరుద్ఘాటించారు.

    సుదీర్ఘ ప్రజా జీవితంలో తనకు ఎన్నో రంగాలలో విస్తృత అనుభవాలు ఉన్నాయని, జైలు జీవితం అనే ఒక్క అనుభవం మాత్రమే మిగిలి ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. విద్యార్థి ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, చట్టసభల నిర్వహణ, మీడియా రంగంలో దశాబ్దాల పాటు పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. ఒకవేళ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జైలుకు వెళ్లాల్సి వస్తే.. తన జీవిత విశేషాలతో రాసుకోబోయే ఆత్మకథకు ఆ అనుభవం ఒక పరిపూర్ణమైన అధ్యాయంగా మారుతుందే తప్ప, తాను భయపడే ప్రసక్తే లేదని విశ్లేషించారు.

    కొద్దిరోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహానికి గురైన జనసేన నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే, వివాదం ముదురుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించి, తానూ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన జనసేన పార్టీ సైతం సానుకూలంగా స్పందిస్తూ, ఆయన వివరణను ఆమోదిస్తున్నామని, ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నామని అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ, తెరవెనుక అరెస్ట్ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం సాగుతుండటం, దానికి బలం చేకూరుస్తూ నాగేశ్వర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.