Mahaa Daily Exclusive

  ‘సింహం నిద్రలేచింది.. ఆట మొదలైంది!’: పవన్‌పై బండ్ల గణేష్ సంచలన పోస్ట్

Share

  • గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం.. నిర్మాత తనదైన శైలిలో స్పందన

    రాజమండ్రి, మహా.

    జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పనితీరును ఉద్దేశించి ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. పవన్‌ను సింహంతో పోలుస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాలనలో పవన్ చూపిస్తున్న పట్టును, అధికారుల తీరుపై ఆయన వ్యక్తం చేసిన అసహనాన్ని ప్రస్తావిస్తూ బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

    “సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం… ఇప్పుడైనా అర్థమైందా? ఆట మొదలైంది… తప్పు జరిగితే ఈ సింహం ఊరుకోదు, అవినీతి జరిగితే సహించదు. తాను నిద్రపోదు… ఇతరులను నిద్రపోనివ్వదు. అది సింహం నైజం… దానికి మనమేం చేయలేం!” అంటూ బండ్ల గణేష్ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అధికార బాధ్యతలు చేపట్టాక క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలను ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయంటూ జనసేన శ్రేణులు దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నాయి.

    రాజమండ్రి పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గోదావరి నది పుష్కర ఏర్పాట్లను సమీక్షించడమే కాకుండా, నది ప్రస్తుత స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో గోదావరి నది తీవ్రంగా కలుషితమవుతున్న తీరును చూసి ఆయన తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన నదిలోకి మురుగునీరు చేరుతున్న వైనాన్ని భరించలేకపోయిన ఆయన.. ఇలాంటి దుస్థితిలో ఉన్న గోదావరిని చూస్తుంటే, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటలోని కొన్ని లైన్లను మార్చేయాల్సిన అవసరం ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మురుగు నీటితో పుణ్యం రావడం పక్కన పెడితే, ప్రజలకు రోగాలు రావడం ఖాయమని అధికారుల ముందే అసహనం వెలిబుచ్చారు. గోదావరి నది పునరుద్ధరణకు, కాలుష్య నివారణకు అక్కడికక్కడే అధికారులకు పటిష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే, తప్పులను సరిదిద్దేందుకు పవన్ రంగంలోకి దిగారనే అర్థంలో బండ్ల గణేష్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.