Mahaa Daily Exclusive

  మావోయిస్ట్‌ అగ్రనేత నరహరి లొంగుబాటు

Share

  • క్రమంగా అంతరించిపోతున్న మావోయిస్ట్ ఉద్యమం
  • జనజీవన స్రవంతిలోకి క్యూ కట్టిన ముఖ్య నేతలు
  • భార్య ధనమ్మతో కలిసి లొంగిపోయిన డీజీపీ ఎదుట లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు

హైదరాబాద్, మహా :

వరుస లొంగుబాట్లతో ఇప్పటికే ఉనికి కోల్పోయిన మావోయిస్ట్‌లకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేత, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఆయన భార్య ధనమ్మ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మే 12న నరహరి దంపతులు లొంగిపోయినట్లు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. నరహరి గత 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. జనజీవన స్రవంతిలో చేరిన నరహరి, ధనమ్మలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున నరహరికి రూ.25 లక్షలు, ధనమ్మకు రూ.20 లక్షల చెక్‌ను డీజీపీ అందజేశారు.

నరహరి స్వస్థలం పాత వరంగల్ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామం. వరంగల్‌ ఎల్‌బీ కాలేజ్‌లో 1982లో డిగ్రీ చదువుతోన్న సమయంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. లొంగుబాటుకు ముందు ఆయన బిహార్‌-ఝార్ఖండ్‌ స్పెషల్‌ ఏరియా కమిటీ ఇంఛార్జిగా, ఈస్ట్‌ రీజినల్‌ బ్యూరో (ఈఆర్‌బీ) ఇంఛార్జిగా, ఝార్ఖండ్‌ టెక్నికల్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ఏపీలో గుంటూరుకు చెందిన పూనం ప్రస్తుతం రీజినల్‌ కమిటీ మెంబర్‌ హోదాలో ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్‌ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక వేదికగా పరిగణించే కేంద్ర కమిటీ కొన్నేళ్లుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోల కంచుకోటలు బద్దలయ్యాయి. వరుస ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లతో నక్సల్ సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులు ఎన్‌కౌంటర్లలో చనిపోగా, మరికొందరు లొంగిపోతున్నారు. ప్రస్తుతం నరహరి లొంగుబాటుతో కేంద్ర కమిటీలోని అత్యంత కీలక నేతలు మిసిర్ బెస్రా, గణపతి మాత్రమే మిగిలినట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

మావోయిస్టు పార్టీలో పసునూరి నరహరి అలియాస్ సంతోష్ కీలక పాత్ర పోషించారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నాలుగున్నర దశాబ్దాలుగా ఆ పార్టీలో ఆయన ముఖ్య భూమిక పోషించారన్నారు. దేశవ్యాప్తంగా 47 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. అందులో తెలంగాణాకి చెందిన వారు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఒకరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు 15, జార్ఖండ్ 13, ఒడిశాకు చెందిన 15 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని వివరించారు. 2024 నుండి ఇప్పటి వరకు 822 మంది మావోయిస్టులు మొత్తం 334 ఆయుధాలతో తెలంగాణా పోలీసులు ఎదుట లొంగిపోయారని చెప్పారు. ఇక తెలంగాణా పోలీసులు ముందు లొంగిపోయిన ఒడిశాకి చెందిన మావోయిస్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టులను త్వరలో వారి ప్రాంతాలకు వెళ్లి స్వయంగా కలుస్తానని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. తెలంగాణాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ గణపతితోపాటు జాడే రత్న బాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు లొంగిపోవాలని ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. మీరు లొంగిపోతే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్‌తోపాటు సదుపాయాలు కల్పిస్తామని అజ్ఞాతంతో ఉన్న మావోయిస్టులకు డీజీపీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.