Mahaa Daily Exclusive

  గాంధీ ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారీ…..

Share

**గాంధీ ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారీ**
**ఇనుప మేకులు మింగి ఆస్పత్రిలో చేరిక.. బాత్రూమ్ కిటికీ గుండా ఉడాయింపు**
**పోలీసుల కళ్లుగప్పిన అమీర్ హుస్సేన్.. ముమ్మరంగా గాలింపు చర్యలు**
**హైదరాబాద్, మహా**
పటిష్టమైన బందోబస్తు మధ్య గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. చంచల్‌గూడ జైలుకు చెందిన సయ్యద్ అమీర్ హుస్సేన్ (25) అనే ఖైదీ ఆస్పత్రిలోని బాత్రూమ్ కిటికీ గుండా అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో నగర పోలీసులు అప్రమత్తమై నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడిన కేసులో సయ్యద్ అమీర్ హుస్సేన్‌ను ఇటీవల తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పది రోజుల క్రితం అతడిని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. అయితే, జైలులో ఉన్న సమయంలో అతడు అనూహ్యంగా కొన్ని ఇనుప మేకులు మింగడంతో ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. దీంతో జైలు అధికారులు వెంటనే అప్రమత్తమై, మెరుగైన వైద్యం నిమిత్తం అతడిని ఎస్కార్ట్ పోలీసుల బందోబస్తు నడుమ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
గాంధీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అమీర్ హుస్సేన్.. మంగళవారం బాత్రూమ్‌కు వెళ్లాలని ఎస్కార్ట్ పోలీసులను కోరాడు. లోపలికి వెళ్లిన తర్వాత ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు తీసి చూడగా, అప్పటికే అతడు బాత్రూమ్ కిటికీ గుండా తప్పించుకుని పారిపోయినట్లు నిర్ధారించుకున్నారు. ఖైదీ పరారైన విషయాన్ని గుర్తించిన వెంటనే అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఖైదీని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో నగరవ్యాప్తంగా విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.