- తప్పుడు లెక్కలతో
- రైతులను మోసం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం
- బీజేఎల్ పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- భువనగిరిలో పర్యటించిన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు
భువనగిరి, మహా : తప్పుడు లెక్కలు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఘోరంగా మోసం చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌తో పాటు, వడపర్తి ఐకేపీ కేంద్రాన్ని బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసుల వద్దే పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్రలో మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, రామారావు పటేల్, వెంకట రమణా రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏలేటి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 80 శాతం పంట కొనుగోలు పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. సీఎం చెబుతున్నవన్నీ అబద్ధపు మాటలు, తప్పుడు లెక్కలని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తాను చూపే కొనుగోలు కేంద్రాలకు రావాలని, నెల రోజులుగా రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూడాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వరితో పాటు జొన్నలు, సన్‌ఫ్లవర్ పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, శనగల కొనుగోలు ప్రక్రియ అసలు ప్రారంభమే కాలేదని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీని తీసుకొచ్చి, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఐకేపీ సెంటర్లు, ఏఎంసీ మార్కెట్లలో రైతులు నెల రోజులుగా ధాన్యం కుప్పల వద్దే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాపలా కాస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గింజలు జోకడానికి గంపలు, సంచులు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందని, మరో నాలుగు రోజుల్లో రుతుపవనాలు ప్రారంభం కానున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, మద్దతు ధర కల్పిస్తాం’ అని నాడు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి, నేడు రైతులను ఎందుకు వంచించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్ళాల బాట పట్టడంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తాము వస్తున్నామనే భయంతోనే అప్పటికప్పుడు లారీలను పంపుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్న గజ్వేల్‌కు బీజేపీ బృందం వెళ్లడంతో కలెక్టర్ స్వయంగా వచ్చి 30 లారీలను ఏర్పాటు చేశారని, ఇవాళ భువనగిరి కేంద్రానికి వస్తున్నామని తెలియగానే ఇప్పుడిప్పుడే లారీలు వస్తున్నాయని చెప్పారు. గత 40 రోజులుగా నిద్రపోయిన యంత్రాంగం, తాము వస్తుంటేనే లారీలు పంపడం వారి వైఫల్యానికి నిదర్శనమన్నారు. తమ రాకతోనే లారీలు వస్తాయంటే.. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించడానికి, రైతుల పక్షాన నిలబడడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. అన్నదాతలకు అండగా ఉంటూ, ప్రతి రైతు పండించిన చివరి గింజ కొనుగోలు చేసేంత వరకు బీజేపీ పోరాటం ఆపదని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.








