ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.
* చెవిరెడ్డి కుటుంబం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
* విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భార్య, కుమారుడు.
* హవాలా, మనీ లాండరింగ్ వ్యవహారాలపై అధికారుల ప్రశ్నల వర్షం.
* భార్య పేరుమీద భారీగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తింపు.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సంచలనాత్మక ‘ఏపీ లిక్కర్ స్కామ్’ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగాన్ని అమాంతం పెంచింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక మూలాలను తవ్వుతున్న అధికారులు తాజాగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులపై గురిపెట్టారు. ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, ఆయన కుమారుడు తాజాగా అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
**భారీగా అనుమానాస్పద లావాదేవీలు**
లిక్కర్ స్కామ్‌లో అక్రమంగా ఆర్జించిన నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భార్య పేరు మీద పెద్ద ఎత్తున అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాలకు పెద్ద ఎత్తున నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి బదిలీ అయింది? అనే వ్యవహారాలపై ఆరా తీసేందుకే వారిని స్వయంగా విచారణకు పిలిచినట్లు సమాచారం.
**హవాలా, మనీ లాండరింగ్ కోణంలో ప్రశ్నల వర్షం**
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ప్రధానంగా హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారాయని, అలాగే భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ లోతైన విచారణ జరుపుతోంది. ఈ మనీ లాండరింగ్, హవాలా లావాదేవీల్లో నేరుగా చెవిరెడ్డి భార్య, ఆయన కుమారుడి పాత్ర ఉన్నట్లు కొన్ని ఆధారాలు వెలుగులోకి రావడంతోనే విచారణను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్ వివరాలు, అనుమానాస్పద నగదు బదిలీలు తదితర అంశాలపై విచారణ సందర్భంగా అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈడీ తాజా దూకుడుతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉన్న నేతల్లో తీవ్ర కలకలం రేగుతోంది.







