- దీదీ కోటకు బీటలు.
- కుప్పకూలుతున్న తృణమూల్ కాంగ్రెస్.
- వార్నింగ్‌తో వణుకుతున్న అవినీతి తిమింగలాలు.
- మేనల్లుడు అభిషేక్‌కు ఈడీ ఉచ్చు.
- దిక్కుతోచని స్థితిలో మమతా బెనర్జీ.
హైదరాబాద్, మహా.
**పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. నిన్నమొన్నటి వరకు దేశ రాజకీయాల్లో ఒక అజేయ శక్తిగా వెలుగొందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పునాదులు ఇప్పుడు కళ్లముందే కదిలిపోతున్నాయి. మమతా బెనర్జీ ఓటమి పాలైన నాటి నుంచి ఆ పార్టీలో ముసలం తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ సాధించిన చారిత్రక విజయంతో టీఎంసీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. ఒకవైపు రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో తృణమూల్ అగ్ర నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దశాబ్దన్నర అరాచక పాలనపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్న వేళ, బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి**
**పదిహేనేళ్ల సామ్రాజ్యం పటాపంచలు**
బెంగాల్ గడ్డపై సుదీర్ఘకాలం పాటు ఏకచత్రాధిపత్యం వహించిన మమతా బెనర్జీ సామ్రాజ్యం ఇప్పుడు పటాపంచలయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత సొంత పార్టీపై దీదీ పట్టు పూర్తిగా సడలిపోయింది. పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఆమె మాటలను కనీసం ఖాతరు చేసే పరిస్థితిలో లేరు. రాష్ట్రాన్ని దశాబ్దంన్నర పాటు శాసించిన నాయకత్వం ఇప్పుడు సొంత పార్టీ నేతల అసంతృప్తి జ్వాలల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. వరుస రాజీనామాలు, అంతర్గత కుమ్ములాటలతో తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం ఒక మునిగిపోతున్న నావను తలపిస్తోంది.
**బెంబేలెత్తుతున్న కౌన్సిలర్లు**
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో టీఎంసీ ప్రజాప్రతినిధులు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు. పలు మున్సిపాలిటీలకు చెందిన దాదాపు వంద మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. వచ్చే ఏడాది జరగాల్సిన పురపాలక ఎన్నికలకు ముందే ఈ పాలకమండళ్లన్నీ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంగా మమతా బెనర్జీ రంగంలోకి దిగి రాజీనామాలు చేయవద్దని బుజ్జగించినా ఎవరూ ఆమె మాట వినే పరిస్థితి లేదు. ఏకంగా మమత అత్యంత సన్నిహితుడు, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ సైతం తన పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తుండటం ఈ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది.
**సీఎం సువేందు అధికారి ఉక్కుపాదం**
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి టీఎంసీ అవినీతి నేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యకలాపాలు, అక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇచ్చిన వార్నింగ్ టీఎంసీ కౌన్సిలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యమంత్రి హెచ్చరికల దెబ్బకు చాలా మంది నాయకులు ముఖం చాటేశారు. అవినీతి, దోపిడీ ఆరోపణలపై ఇరుక్కుంటామన్న భయంతో రోజువారీ విధులకు, కనీసం తమ కార్యాలయాలకు వెళ్లడానికి కూడా వారు జంకుతున్నారు.
**అవినీతి కేసుల్లో వరస అరెస్టులు**
గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చక్రం తిప్పిన కీలక నేతలు ఇప్పుడు కటకటాల పాలవుతున్నారు. మున్సిపల్ నియామకాల్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణం టీఎంసీ మెడకు గట్టిగా చుట్టుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అలాగే టీఎంసీ ఎమ్మెల్యే అదితి మున్షీ భర్త అయిన దేబ్రాజ్ చక్రవర్తి కూడా ఈ నియామకాల కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు సంస్థల దూకుడుతో ఏ క్షణంలో ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది.
**అనుమానాస్పద మరణాలతో కలకలం**
ఒకవైపు దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తుండటంతో అధికార పార్టీ నేతలకు సంబంధించిన వ్యవహారాలు విషాదాంతంగా మారుతున్నాయి. తాజాగా సౌత్ డుమ్ డుమ్ టీఎంసీ కౌన్సిలర్ సంజయ్ రాయ్ అనుమానాస్పద మృతి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దేబ్రాజ్ చక్రవర్తికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సంజయ్ రాయ్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. విచారణ ఎదుర్కోలేక, జైలుకు వెళ్లక తప్పదన్న భయంతోనే ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తుండటం కిందిస్థాయి నాయకులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది.
**అభిషేక్ బెనర్జీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు**
మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ లక్ష్యంగా సాగుతున్న పరిణామాలు టీఎంసీ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అభిషేక్‌కు సంబంధించినవిగా చెబుతున్న కోల్‌కతాలోని ఏకంగా పదిహేడు ఆస్తులకు మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేత నోటీసులు జారీ చేయడం పెను సంచలనం సృష్టించింది. ఈ నోటీసుల వ్యవహారంలో కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ పాత్ర కూడా ఉందన్న చర్చ అంతర్గతంగా జరుగుతోంది. బీజేపీ వ్యూహాత్మకంగా అభిషేక్ బెనర్జీ అవినీతి చిట్టాను నెమ్మదిగా బయటకు తీస్తుండటంతో దీదీ వర్గానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
**ధిక్కార స్వరాలు.. పార్టీలో ముసలం**
ఓటమి భారంతో కుంగిపోతున్న పార్టీలో ఇప్పుడు ధిక్కార స్వరాలు తారస్థాయికి చేరాయి. సీనియర్ నేత, ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ లాంటి వారు బహిరంగంగానే పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం టీఎంసీకి కోలుకోలేని ఎదురుదెబ్బ. పార్టీ పతనానికి ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్ వ్యూహాలే కారణమని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు మమతా బెనర్జీ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఎనభై మంది ఎమ్మెల్యేలకు గానూ కేవలం ముప్పై ఆరు మంది మాత్రమే హాజరు కావడం పార్టీపై ఆమె పట్టు ఎంతలా సడలిపోయిందో స్పష్టం చేస్తోంది. కొందరు టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏకంగా బీజేపీ సమావేశాలకు హాజరవుతుండటం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
**’కమలం’ గూటికి క్యూ.. మూసిన గేట్లు**
సమీప భవిష్యత్తులో టీఎంసీకి మనుగడ లేదని నిర్ధారించుకున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు బీజేపీ గూటికి చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాషాయ పార్టీ గనుక గేట్లు తెరిస్తే టీఎంసీ భవన్ పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, మమత హయాంలో ఇష్టారాజ్యంగా అవినీతికి, అరాచకాలకు పాల్పడిన నేతలు ఇప్పుడు తమ చర్మం రక్షించుకునేందుకే పార్టీ మారుతున్నారని బీజేపీ నాయకత్వం పసిగట్టింది. అందుకే వలస నేతలను ఇప్పుడే ఆహ్వానించేది లేదని బీజేపీ కరాఖండిగా చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ఈ అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేస్తుండటంతో, దారి తెలియక తృణమూల్ నేతలు విలవిలలాడుతున్నారు.








