రెవెన్యూ ‘సుచరిత’ అవినీతి భాగోతం.
* ముప్పై ఎకరాలకు ముప్పై లక్షల బేరం.
* లంచాల్లోనూ ‘ఈఎంఐ’ సంస్కృతి.
* కిస్తీల వారీగా వసూళ్లకు తెరలేపిన శామీర్‌పేట్ తహసీల్దార్.
*మొదటి విడతగా రూ. 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన వైనం.
* కార్యాలయం తలుపులు మూసి గంటల తరబడి తనిఖీలు చేసిన డీఎస్పీ ఆనంద్ బృందం.
* ధరణి, రిజిస్ట్రేషన్ల పేరుతో క్షేత్రస్థాయిలో సాగుతున్న నిలువు దోపిడీపై సామాన్యుల ఆగ్రహం.
మేడ్చల్ మల్కాజ్‌గిరి,మహా.
రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు జరుగుతున్నా, లంచాలు తీసుకుంటూ అధికారులు జైలు పాలువుతున్నా క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. పారదర్శక పాలన, అవినీతి రహిత రెవెన్యూ వ్యవస్థ అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. సామాన్యులు, రైతులు తమ సొంత భూముల హక్కుల కోసం, చిన్నపాటి మ్యుటేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగితే జలగల్లా రక్తం పీలుస్తున్న తిమింగలాలు ఇంకా రెవెన్యూ శాఖలోనే తిష్టవేసి కూర్చున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ మండలంలో వెలుగుచూసిన భారీ లంచం ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా 30 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డుల క్లియరెన్స్ కోసం అక్షరాలా 30 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ సుచరిత, మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
**రైతులపై కనికరం లేని కక్కుర్తి**
శామీర్‌పేట్ మండల పరిధిలోని దాదాపు 30 ఎకరాల భూమికి సంబంధించిన అనుమతులు, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని కోరుతూ కొందరు రైతులు గత కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, అక్కడి తహసీల్దార్ సుచరిత మాత్రం లంచం ఇస్తేనే ఫైలు ముందుకు కదులుతుందని, లేదంటే రికార్డుల్లో అభ్యంతరాలు పెడుతామని పరోక్షంగా వేధించడం మొదలుపెట్టారు. చివరకు బాధితులను పిలిపించుకుని ఎకరాకు లక్ష రూపాయల చొప్పున మొత్తం 30 ఎకరాలకు 30 లక్షల రూపాయలు ఇచ్చుకోవాలని ఖరాఖండిగా చెప్పారు. తాము అంత పెద్ద మొత్తం ఒకేసారి ఇచ్చుకోలేమని, తమను కరుణించాలని రైతులు ఆమె కాళ్లవేళ్లపడ్డా ఆ అధికారిణి మనసు కరగలేదు. పైగా లంచాల వసూళ్లలో సరికొత్త ‘ఈఎంఐ’ సంస్కృతికి తెరలేపారు. ఒకేసారి 30 లక్షలు ఇవ్వలేకపోతే కిస్తీల (వాయిదాల) పద్ధతిలో విడతల వారీగా చెల్లించాలని బాధితులతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆమె బరితెగింపునకు పరాకాష్టగా నిలిచింది. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ, లక్షలు డిమాండ్ చేస్తున్న ఆమె వేధింపులను భరించలేకపోయిన సదరు రైతులు.. ఎలాగైనా ఈ అవినీతి అధికారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.
**పక్కా స్కెచ్‌తో పట్టుకున్న ఏసీబీ**
రైతుల నుంచి అందిన పక్కా ఫిర్యాదుతో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలోని బృందం తహసీల్దార్ సుచరిత ఆటకట్టించేందుకు వ్యూహం రచించింది. కెమికల్ పూసిన నోట్లను బాధితులకు అందించి పంపించారు. ముందుగా కుదుర్చుకున్న కిస్తీల ఒప్పందంలో భాగంగా మొదటి విడత కింద రూ. 2 లక్షల నగదును తహసీల్దార్ కార్యాలయంలోనే సుచరితకు బాధితులు అందజేశారు. ఆ డబ్బును ఆమె తీసుకుంటుండగా, అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు మెరుపువేగంతో దాడి చేసి ఆమెను చేతులతో సహా పట్టుకున్నారు. ఆమె చేతులకు కెమికల్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో లంచం తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
**కార్యాలయంలో గంటల తరబడి సోదాలు**
తహసీల్దార్ సుచరిత రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వెంటనే ఏసీబీ అధికారులు కార్యాలయం ప్రధాన ద్వారాలను మూసివేశారు. లోపల ఉన్న సిబ్బందిని, ఇతర రికార్డులను తమ ఆధీనంలోకి తీసుకుని గంటల తరబడి సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. సుచరిత సీటుతో పాటు ఆమె చాంబర్‌లోని ప్రైవేటు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సోదాల్లో పలు అనుమానాస్పద భూములకు సంబంధించిన రికార్డులు, గతంలో జరిగిన కొన్ని కీలక లావాదేవీల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రజాసేవ చేయాల్సిన అత్యున్నత హోదాలో ఉన్న అధికారిణి ఇలా లక్షల రూపాయల లంచాలకు ఆశపడి దొరికిపోవడంపై స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మండల పరిధిలో గతంలో జరిగిన భూ లావాదేవీలు, మ్యుటేషన్లపై కూడా సమగ్రంగా లోతైన విచారణ జరపాలని, ఈ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందో, ఎవరెవరికి వాటాలు వెళ్తున్నాయో నిగ్గుతేల్చాలని వివిధ రైతు, ప్రజా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.








