Mahaa Daily Exclusive

  ఎస్సీ, ఎస్టీలను నిలువునా ముంచిన కాంగ్రెస్ ‘చేవెళ్ల డిక్లరేషన్’…

Share

ఎస్సీ, ఎస్టీలను నిలువునా ముంచిన కాంగ్రెస్ ‘చేవెళ్ల డిక్లరేషన్’.
* పోడు పట్టాల పేరిట మోసం.
* బడా కంపెనీల కోసం గిరిజనుల భూముల లాగివేత.
* తిరగబడిన లంబాడీ బిడ్డలకు బేడీలు వేసిన దుర్మార్గ సర్కార్.
*డిక్లరేషన్ అమలు చేయకుంటే రైళ్లలో ఢిల్లీ వెళ్లి ఖర్గే ఇల్లు ముట్టడిస్తాం.
*ఇందిరాపార్క్ మహాధర్నాలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
ఎన్నికల ముందు చేతులు జోడించి, అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీల చేతులకు బేడీలు వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన బిడ్డలను ఘోరంగా దగా చేసిందని మండిపడ్డారు. ఇందిరాపార్క్ వద్ద లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్ హెచ్ పీ ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గిరిజన తండాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఇందిరాపార్క్ సాక్షిగా మొదలైన ఈ పోరాట సమరశంఖం రాష్ట్రంలోని ప్రతి తండాకు చేరాలని, సీఎం రేవంత్‌రెడ్డి నియంతృత్వ పోకడలపై గిరిజన లోకం తిరగబడాలని పిలుపునిచ్చారు.
**గిరిజన భూముల దారాదత్తం.. ఎదురు తిరిగితే జైలు శిక్షలు**
ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ, రేవంత్‌రెడ్డిలు చేవెళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజనులకు ఎన్నో అబద్ధపు హామీలు గుప్పించారని, ఇవాళ అధికారంలోకి వచ్చాక అదే కాంగ్రెస్ పాములా మారి కాటేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని నమ్మించి, నేడు పరిశ్రమల పేరిట బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఏకంగా 50 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను రేవంత్ సర్కారు బలవంతంగా గుంజుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను లాక్కోవద్దని అడ్డుతిరిగిన ఆడవాళ్లు, గర్భిణులని కూడా చూడకుండా పోలీసులతో దారుణంగా దాడులు చేయించారని విమర్శించారు. భూములను కాపాడుకునేందుకు తిరగబడిన 45 మంది లంబాడీ బిడ్డలకు బేడీలు వేసి జైల్లో పెట్టించిన దుర్మార్గ చరిత్ర రేవంత్‌రెడ్డిదన్నారు. లంబాడీలు అమాయకులు, మంచివాళ్లే కానీ.. వారిని మోసం చేసి కనుమరుగు చేయాలని చూస్తే ఎంతకైనా తెగిస్తారని హెచ్చరించారు. కొడంగల్‌లో గిరిజన బిడ్డల ఆగ్రహానికి త్వరలోనే రేవంత్‌రెడ్డి రాజకీయ సమాధి కాక తప్పదని జోస్యం చెప్పారు.
**ఒక్క హామీ నెరవేర్చని వైనం.. కాంట్రాక్టులు బామ్మర్దికేనా?**
చేవెళ్ల డిక్లరేషన్‌లో ప్రకటించిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని హరీశ్‌రావు లెక్కలతో సహా నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పది, ఇంటర్, పీజీ పాసైతే ఇస్తామన్న నగదు బహుమతులు ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. కొత్తగా నాలుగు ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామని చెప్పి, ఉన్న వాటికి కూడా నిధులు ఇవ్వకుండా నీరసింపజేశారని మండిపడ్డారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి తన బామ్మర్ది సృజన్‌రెడ్డికి మాత్రం వందల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల పేరిట కేవలం 16 వేల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇళ్లు కట్టుకునే ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఇస్తామన్న లక్ష రూపాయల ఊసే లేదన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ విషయంలో మాట తప్పిన రేవంత్‌రెడ్డి, సేవాలాల్ మహరాజ్, కుమ్రం భీం, ఏకలవ్య కార్పొరేషన్ల పేరిట గిరిజనులను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎస్సీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ. 2,730 కోట్లు కేటాయించి కేవలం 50 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఎస్సీ, ఎస్టీలకు లోన్లు ఇస్తే పర్సంటేజీలు రావు కాబట్టే రేవంత్‌రెడ్డి నిధులు ఇవ్వడం లేదని చాలెంజ్ చేశారు.
**కేసీఆర్ హయాంలోనే గిరిజన అభ్యుదయం**
తెలంగాణ రాకముందు గిరిజన హక్కుల కోసం ఎల్ హెచ్ పీ ఎస్ అనేక పోరాటాలు చేసినా వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఏనాడూ పట్టించుకోలేదని హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ‘మా తండాలో మా రాజ్యం’ నినాదాన్ని నిజం చేస్తూ 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజన బిడ్డలను సర్పంచులను చేశారన్నారు. విద్యా, ఉద్యోగాల్లో గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడంతో పాటు మద్యం దుకాణాల కేటాయింపుల్లోనూ 5 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ఒకే విడతలో 4 లక్షల 6 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. సేవాలాల్ జయంతిని ఏడాదికి రెండు కోట్లు కేటాయించి రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించడమే కాకుండా, బంజారాహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువైన ఎకరం స్థలంలో బంజారా ఆత్మగౌరవ భవనాన్ని అద్భుతంగా నిర్మించామన్నారు. ‘టీఎస్ ప్రైడ్’ ద్వారా 13,200 మంది గిరిజన యువతకు వ్యాపారాల కోసం రూ. 800 కోట్లు అందించామని, ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేశామని వివరించారు. నాడు కేసీఆర్ సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవితో గౌరవిస్తే, నేడు రేవంత్ క్యాబినెట్‌లో లంబాడీలకు కనీస ప్రాతినిధ్యం కూడా లేదని విమర్శించారు.
**ఖర్గే ఇల్లు ముట్టడిస్తాం**
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను స్వయంగా ప్రకటించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై తమకు గౌరవం ఉందన్న హరీశ్‌రావు.. ఆయన వెంటనే స్పందించి రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పి డిక్లరేషన్ హామీలను అమలు చేయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ తండాల నుంచి వేలాది మంది గిరిజన బిడ్డలతో నాలుగు రైళ్లు కట్టుకుని ఢిల్లీకి వెళ్లి ఖర్గే ఇంటి ముందే భారీ ధర్నా చేపడుతామని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాల నిలిపివేతపై నిలదీస్తూ, గిరిజనుల ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి తండాల నుంచి ఢిల్లీ దాకా నగరాలు మోగాలని పిలుపునిచ్చారు.