వంద మంది కౌన్సిలర్ల రాజీనామా.
* మమతా పార్టీకి అతిపెద్ద సంక్షోభం.
* అసంతృప్తిలో ఎంపీలు.
* బీజేపీ సమావేశానికి సీనియర్ల హాజరు.
హైదరాబాద్, మహా.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కాకోలి ఘోష్ దస్తిదార్ లాంటి సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, గత కొద్ది రోజుల్లోనే వివిధ మున్సిపాలిటీలకు చెందిన దాదాపు వంద మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో బీజేపీ స్థానిక మున్సిపల్ బోర్డుల్లో తమ పట్టు పెంచుకునే అవకాశం ఏర్పడింది. పరిస్థితి తీవ్రతను బట్టి చూస్తే, వచ్చే ఏడాది జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పలు మున్సిపల్ బోర్డులు రద్దయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ సైతం రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కౌన్సిలర్లను రాజీనామా చేయొద్దని మమత కోరినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని, 1998లో పార్టీ ఆవిర్భావం తర్వాత టీఎంసీకి ఇదే అత్యంత క్లిష్టమైన పరిస్థితి అని స్పష్టమవుతోంది.
స్థానిక సంస్థల గత కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేయడంతో కౌన్సిలర్ల రాజీనామాల పరంపర మొదలైంది. అవినీతి, దోపిడీ ఆరోపణలపై కొందరు టీఎంసీ కౌన్సిలర్ల అరెస్టులు జరగడంతో మిగతావారిలో భయం మొదలైంది. గత వారం ముగ్గురు కౌన్సిలర్లు అరెస్ట్ కాగా, చాలా మంది తమ కార్యాలయాలకు వెళ్లడమే మానేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీల్లో నిర్వాహకులను (అడ్మినిస్ట్రేటర్లను) నియమిస్తోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ వెల్లడించారు. మరోవైపు, మే 23న సౌత్ డుమ్ డుమ్ కౌన్సిలర్ సంజయ్ దాస్ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మరణించడం మరింత ఆందోళన రేకెత్తించింది. దేబ్రాజ్ చక్రవర్తికి సన్నిహితుడిగా పేరున్న సంజయ్ దాస్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ నియామకాల కుంభకోణంలో ఇప్పటికే మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఈడీ అరెస్ట్ చేయగా, ఇప్పుడు టీఎంసీ మాజీ ఎమ్మెల్యే అదితి మున్షీ భర్త అయిన దేబ్రాజ్ చక్రవర్తిపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.
నార్త్ 24 పరగణాలు, దాని చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ సంక్షోభ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. భట్పారా మున్సిపాలిటీలో 35 మందికి గానూ 30 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయగా, హలీషహర్‌లో 23 మందికి 16 మంది, కంచ్రపారాలో 14 మంది కౌన్సిలర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకత్వం లేనందునే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని భట్పారా మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ దేబజ్యోతి ఘోష్ స్పష్టం చేశారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్లో సైతం గందరగోళం నెలకొంది. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేత నోటీసులు ఇవ్వడం, ఆ మరుసటి రోజే బీజేపీ ఏకంగా 43 ఆస్తుల జాబితాను విడుదల చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంతో ఫిర్హాద్ హకీమ్, అభిషేక్ బెనర్జీ మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. దీనిపై మమత ఆగ్రహం వ్యక్తం చేయడంతో, తనకు తెలియకుండానే నోటీసులు వెళ్లాయని హకీమ్ వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాకుండా, మే 22న కౌన్సిలర్లతో కలిసి ప్రధాన ఛాంబర్ బయట సమావేశం నిర్వహించాల్సి రావడం ప్రజాప్రతినిధులకు జరిగిన ఘోర అవమానంగా హకీమ్ పేర్కొన్నారు. వరుస రాజీనామాలతో మున్సిపల్ సేవలు స్తంభించిపోయాయని, రానున్న వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య, డ్రైనేజీ పనులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలోనూ పార్టీ అధిష్టానానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి 80 మంది ఎమ్మెల్యేలకు గానూ కేవలం 36 మంది మాత్రమే హాజరు కావడం అసమ్మతికి అద్దం పడుతోంది. పార్టీ సీనియర్ నేత, ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ బరాసత్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే కాకుండా, ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం సువేందు అధికారి నిర్వహించిన అధికారిక సమావేశానికి హాజరయ్యారు. నాలుగు దశాబ్దాల విధేయతకు తగిన బహుమతి లభించిందంటూ లోక్‌సభలో తన చీఫ్ విప్ పదవిని తొలగించడంపై ఆమె వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఐ-ప్యాక్ లాంటి ప్రైవేట్ సంస్థల వల్లే పార్టీ నాశనమైందని తన రాజీనామా లేఖలో విమర్శించిన ఆమె, “నాయకురాలా, ఇకనైనా పార్టీ బాధ్యతలు తీసుకోండి” అంటూ మమతా బెనర్జీకి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. మరో పక్క సువేందు అధికారి ఖాళీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గానికి అభ్యర్థిని వెతకడంలోనూ టీఎంసీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది, ఇద్దరు నేతలు ఇప్పటికే పోటీకి నిరాకరించారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి, ఆ స్థానాన్ని అట్టిపెట్టుకుని నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ వేగవంతమైన పరిణామాలన్నీ టీఎంసీ ముంచుకొస్తున్న పెను ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.








