Mahaa Daily Exclusive

  మూడు రోజుల పోలీసు కస్టడీకి బండి భగీరథ్…

Share

  • మూడు రోజుల పోలీసు కస్టడీకి బండి భగీరథ్
  • అనుమతించిన మల్కాజిగిరి కోర్టు
  • థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దు, ఎలాంటి వత్తిడిలు చేయోద్దు
  • షరతులు విధించిన న్యాయస్థానం

హైదరాబాద్, మహా : పొక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో భగీరథ్‌ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు వేసిన పిటిషన్‌ను కోర్టు సమర్థించింది. నిందితుడిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ్‌పై నమోదైన తీవ్రమైన ఆరోపణల కారణంగా మరిన్ని ఆధారాలు సేకరించడానికి పోలీసులు కస్టడీని కోరారు. ఈ మూడు రోజుల వ్యవధిలో ఘటన జరిగిన తీరు, ఇతరు ప్రమేయాలు, సాంకేతిక ఆధారాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు. ఇప్పటికే బాధితురాలి నుండి సేకరించిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిందితుడిని ప్రశ్నించి, కీలక విషయాలను వెలికితీయాలని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం, బుధవారం నుండి భగీరథ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. విచారణ సమయంలో నిందితుడిపై ఎటువంటి ఒత్తిడి గానీ, థర్డ్ డిగ్రీ గానీ ఉపయోగించకూడదని కోర్టు నిబంధనలు విధించింది. అలాగే ప్రతిరోజూ విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ విచారణలో వెల్లడయ్యే అంశాలు కేసు తుది తీర్పులో అత్యంత కీలకం కానున్నాయి.

మరోవైపు, ఈ కేసు రాజకీయంగా కూడా సున్నితమైనది కావడంతో నేపథ్యంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కస్టడీ సమయంలో భగీరథ్‌కు సంబంధించిన మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్, సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కస్టడీ గడువు ముగిసిన తర్వాత తిరిగి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పొక్సో చట్టం కింద నమోదైన కేసు కావడంతో పోలీసులు అత్యంత పకడ్బందీగా ఛార్జ్ షీట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.