Mahaa Daily Exclusive

  ఏపీలో నిప్పుల కొలిమి…..

Share

ఏపీలో నిప్పుల కొలిమి.
* మరో నాలుగు రోజులు వడగాలులు.
* ఉగ్రరూపం దాల్చిన భానుడు.
* రాష్ట్రంలో భగభగలు.
అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరాలా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల తీవ్రత అత్యంత దారుణంగా ఉంటుందని, ప్రజలు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునేందుకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు ఈ తాజా వడగాలుల ముప్పు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మండుతున్న ఎండలకు తోడు తోలగని ఉక్కపోతలతో సామాన్యులు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోయే భయానక పరిస్థితులు దాపురించాయి.

*ఆరెంజ్ అలర్ట్.. ఆరు జిల్లాల్లో కాలుతున్న అగ్నిగుండం.

రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కనీవినీ ఎరుగని రీతిలో ఉండబోతోందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ప్రధానంగా ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు అధికారులు అత్యంత ప్రమాదకరమైన ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. ఈ ఆరు జిల్లాల్లో వడగాలులు ప్రచండంగా వీస్తాయని, పగటి పూట రోడ్లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తాయని స్పష్టం చేశారు. వాతావరణం నిప్పులు చెరుగుతున్న వేళ, అత్యవసరమైతే తప్ప ఈ ప్రాంతాల ప్రజలు ఆరుబయట అడుగుపెట్టొద్దని, వడదెబ్బ బారినపడే ప్రమాదం పొంచి ఉందని అధికారులు కఠినంగా సూచిస్తున్నారు.

*ఎల్లో అలర్ట్.. మరో ఎనిమిది జిల్లాల్లో ఉక్కపోత నరకం

తీవ్రమైన ఎండల బారి నుంచి మరికొన్ని జిల్లాలకు కూడా ఏమాత్రం ఉపశమనం లేదు. నెల్లూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. ఇక్కడ నేరుగా వడగాల్పుల ఉద్ధృతి ఆరెంజ్ అలర్ట్ ప్రాంతాల కంటే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. వేడి గాలులు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోతలతో ప్రజలు నరకయాతన అనుభవించక తప్పదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉండటంతో చిన్నారులు, వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

*పదేళ్ల రికార్డులు బద్దలు.. రంగంలోకి ప్రభుత్వం.

రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఏకంగా 48 డిగ్రీల మార్కును దాటేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, కృష్ణా జిల్లా కంకిపాడు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లాంటి ప్రాంతాల్లో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం వాతావరణ చరిత్రలోనే పెను సంచలనం. 2016 తర్వాత ఈ స్థాయిలో రాష్ట్రం మండిపోవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో విజృంభిస్తున్న ఈ తీవ్రమైన వడగాలుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం అత్యవసర సమీక్ష నిర్వహించి అధికార యంత్రాంగాన్ని హైఅలర్ట్ చేశారు. విపత్తు నిర్వహణ సంస్థ ఎండల తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ హెచ్చరికలు పంపాలని ఆయన ఆదేశించారు.

*ఇంటిపట్టునే ఉండండి.. ఏపీఎస్‌డీఎంఏ కఠిన సూచనలు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్రత పతాక స్థాయిలో ఉంటుందని, ఈ సమయంలో ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పనిగట్టుకుని ఎండలో తిరిగితే నిలువునా ప్రాణాలు పోయే ముప్పు ఉందని హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ, గొడుగు ధరించడంతో పాటు, శరీరాన్ని చల్లబరిచే ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు లాంటి ద్రవాహారాలు విరివిగా తీసుకోవాలని, ఎప్పటికప్పుడు డీహైడ్రేషన్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ నిపుణులు సూచిస్తున్నారు.