Mahaa Daily Exclusive

  గ్రామ పంచాయతీ సిబ్బందికి గుడ్‌న్యూస్.

Share

గ్రామ పంచాయతీ సిబ్బందికి గుడ్‌న్యూస్.
* ఇక ఐఏఎస్‌లతో సమానంగా ఒకటో తేదీనే జీతాలు!
*ప్రతి నెలా రూ. 50 కోట్లు ప్రత్యేకంగా మంజూరు.
*జీతాల చెల్లింపులు ఒక్కరోజు ఆలస్యమైనా అధికారులపై కొరడా.
*ట్రెజరీకి బదులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే పంచాయతీల సొంత ఆదాయం.
* పోస్టాఫీసుల ద్వారా కాకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా పింఛన్లు.
* సీఎం రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం.
హైదరాబాద్, మహా
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ఊరటనిచ్చారు. ఏళ్ల తరబడి వేతనాల కోసం ఎదురుచూస్తున్న కార్మికుల కష్టాలకు చెక్ పెడుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీనే కచ్చితంగా జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అత్యున్నత స్థాయిలోని ఐఏఎస్ అధికారులకు నెల నెలా సమయానికి జీతాలు ఎలాగైతే అందుతున్నాయో, క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా అదే రీతిలో ఒకటో తేదీనే వేతనాలు అందాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పంచాయతీ సిబ్బంది జీతాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి నెలా రూ. 50 కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. కేవలం పంచాయతీ సిబ్బందికే కాకుండా, ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఎలాంటి తేడా లేకుండా ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సిబ్బందికి జీతాలు చెల్లించడంలో ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది కార్మికుల కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది.
గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయంప్రతిపత్తిని కాపాడే దిశగా సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీల సొంత ఆదాయంపై (ఓన్ సోర్స్ రెవెన్యూ) వాటికున్న స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను తక్షణమే రద్దు చేసి, తిరిగి పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 లోని సెక్షన్ 70(3)కు ప్రతిపాదిత సవరణలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సవరణల ద్వారా ఇకపై గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా, నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే వెసులుబాటు కలగనుంది. దీనివల్ల నిధుల వినియోగంలో పంచాయతీలకు స్వేచ్ఛ లభించి, గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి.
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ విధానంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమూల మార్పులు తీసుకువచ్చారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పెన్షన్ల విధానాన్ని మార్చి, ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. అనర్హులకు చెక్ పెట్టి, నిజమైన అర్హులకే పెన్షన్లు అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకోసం ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, ఎస్ఈసీసీ డేటా ప్రాతిపదికన పెన్షన్ల పంపిణీ విధానాన్ని పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేయాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, భవిష్యత్తులో కొత్తగా మంజూరు చేసే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.