‘క్యా బోల్తీ పబ్లిక్’తో దేశవ్యాప్త ప్రచారం.
* సెప్టెంబర్ నుంచి ప్రజల్లోకి సీజేపీ.
* రాజకీయ పార్టీ కాదు.. ప్రజా ఒత్తిడి వేదికగానే కొనసాగుతాం.
* అభిజీత్ దీప్కే
ముంబై, మహా .
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్తంగా ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో కొత్త ప్రజా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం, ప్రభుత్వ వ్యవస్థల జవాబుదారీతనం వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ రాష్ట్రాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటామని వెల్లడించారు.
మహారాష్ట్రలో నిర్వహించిన పార్టీ ప్రధాన బృంద సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దీప్కే.. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. సీజేపీ రాజకీయ పార్టీగా కాకుండా ప్రజల తరఫున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రెషర్ గ్రూప్‌గా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, అధికార రాజకీయాల కంటే ప్రజా ఉద్యమాలకే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
దేశ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పెరుగుతున్న ఫీజులు, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత క్షీణించడం, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో తగ్గుతున్న విశ్వాసం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చను ప్రారంభిస్తామని దీప్కే తెలిపారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్థాగత జవాబుదారీతనం ప్రమాదకర స్థితికి చేరుకుందని దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేవారని, ప్రస్తుతం ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వాలే నిర్ణయిస్తున్నాయనే పరిస్థితి నెలకొంటోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ, ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయత పెరిగే వరకు అవకతవకలకు అడ్డుకట్ట పడదని వ్యాఖ్యానించారు.
దేశంలో నిరుద్యోగం అత్యంత తీవ్రమైన సమస్యగా మారిందని, దీనిని జాతీయ సమస్యగా పరిగణించి ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని దీప్కే స్పష్టం చేశారు. ప్రజల గొంతుకగా నిలిచి వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే ‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రచార కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.






