Mahaa Daily Exclusive

  చల్లని కబురు…….

Share

  • చల్లని కబురు
  • రెండో వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు
  • మూడు రోజులు వర్షాలు, తగ్గనున్న ఉష్ణోగ్రతలు
  • రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఐఎండీ

హైదరాబాద్, మహా : తెలంగాణలో ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో భానుడు సృష్టిస్తున్న భీభత్సానికి త్వరలోనే బ్రేక్ పడనుంది. గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడానికి పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రుతుపవనాల రాకతో పాటు రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉంది. ఇవి గురువారం నాటికి కేరళలో ప్రవేశిస్తే, అక్కడ నుంచి వారం రోజులలోపు, అంటే జూన్ రెండో వారంలోగా ఇవి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రుతుపవనాల రాక కంటే ముందే రాష్ర్టంలో ముందస్తు వర్షాలు ఊపందుకోనున్నాయి. దీనివల్ల రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా వేడి గాలుల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడనుంది. బుధ, గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

బుధవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వర్షాలు పడనున్నాయి. మరోవైపు మధ్య, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఈ మేరకు హెచ్చరిక జారీ చేశారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున పాత ఇళ్లు, తాత్కాలిక షెడ్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల దగ్గర ఉండకూడదు. ఖరీఫ్ సీజన్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఈ ముందస్తు వర్షాల ఆధారంగా భూమిని సిద్ధం చేసుకోవచ్చు. అయితే కోసి ఆరబోసిన పంటలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో కూడా ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండి తెలిపింది.