Mahaa Daily Exclusive

  తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు……

Share

  • తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు
  • నీ అయ్యా జాగీరు కాదు
  • ఎపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి పొన్నం కౌంటర్
  • పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్టు అని వ్యాఖ్య
  • బీజేపీ, బీఆర్ఎస్ లలో ఎవరో రసిచ్చిన స్క్రిప్ట్ ను వపన్ చదువుతున్నారని వ్యాఖ్య
  • తెలంగాణలో పవన తిరిగితే జనాలు వస్తారు కానీ ఓటు వేయరన్న మంత్రి

హైదరాబాద్, మహా : తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు.. నీ అయ్యా జాగీరు కాదంటూ జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్‌ వేదికగా స్పందించారు. మిస్టర్ పవన్ కళ్యాణ్.. ఇది మా అయ్యా జాగీరే అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి పీకేదేంటీ? అని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అభివర్ణించారు. తన దగ్గర డబ్బులు ఉంటే తాను కూడా పవన్‌తో ఒక క్యారెక్టర్ చేయిస్తానన్నారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ మరోసారి అక్కసు వెళ్లగక్కారంటూ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి పవన్ అని తెలిపారు. గద్దర్‌కు కారు కొనిచ్చా అని చెప్పినందుకు ముందు క్షమాపణ చెప్పాలంటూ పవన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. చనిపోయిన వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అని అన్నారు. తనకి ఆంధ్రాలోనే దిక్కు లేదని పవన్ చెప్పుకున్నాడని వ్యంగ్యంగా అన్నారు. ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రా వాళ్ళని మేం ఏం అనలేదన్న పొన్నం మేం ఆంధ్రా వాళ్ళని ఏదో అన్నట్టు పవన్ కల్యాణ్ అబద్ధాలు చెబుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంటులో ఏ బిల్లు చేసినా తలుపులు మూసే పాస్ చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. కొండగట్టుకు ఇచ్చిన పైసలు మీ అయ్యా జాగీరా? అని సందేహం వ్యక్తం చేశారు. అయినా కొండగట్టుకు వస్తే ప్రోటోకాల్ తో స్వాగతించి గౌరవించామని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టడం గెలకడం కాదా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తిరిగితే జనాలు వస్తారు కానీ ఓట్లు వేయరని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చినా, పోయినా మాకేం సంబంధం లేదన్నారు. తెలంగాణ ఎప్పుడైనా ఏపీ ప్రజలను స్వాగతిస్తూనే ఉంటుందని చెప్పారు. సినిమా నటుడిగా పవన్ ఎక్కడ తిరిగినా తమకేం ఇబ్బంది లేదన్నారు. తెలంగాణపై తనకు ఉన్న అక్కసును పవన్ కళ్యాణ్ వెళ్లగక్కారని మండిపడ్డారు. తెలంగాణకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను.. పవన్ కళ్యాణ్ చదువుతున్నారని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటికీ.. ప్రాంతాలుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలని తాము కోరుకున్నామని పొన్నం తెలిపారు. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభతో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పీకేది ఏముందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ లేదా బీజేపీ ఎవరో ఒకరు ఎంగేజ్ చేసుకున్న ఆర్టిస్ట్ అని.. అయితే ఆయనకు సరైన స్క్రిప్ట్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో ఆర్టిస్ట్‌ను స్క్రీన్ టెస్ట్ చేసినట్లు తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ను బీజేపీ పార్టీ టెస్ట్ చేస్తున్నారనేది వాస్తవం అని తెలిపారు. ఆంధ్రా ప్రజలను ఎప్పుడూ తెలంగాణ ప్రజలు స్వాగితిస్తున్నారని గుర్తు చేశారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని తెలిపారు. ఎప్పుడైనా తెలంగాణకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారా.. తెలంగాణ అమరవీరులకు ఏరోజైనా అండగా నిలిచారా అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.